iDreamPost
android-app
ios-app

మోదీ మనసు గెలుచుకున్న నేషనల్ క్రష్.. రష్మిక వీడియోకి ప్రధాని రిప్లై

  • Published May 17, 2024 | 5:50 PM Updated Updated May 17, 2024 | 5:50 PM

రష్మిక మందన్నని నేషనల్ క్రష్ అని ఊరికే అనలేదు. నేషన్ వైడ్ గానే కాకుండా.. నేషన్ ని పాలించే ప్రధాని మనసుని సైతం గెలుచుకుందీ బ్యూటీ. ఒకే ఒక్క వీడియో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది.

రష్మిక మందన్నని నేషనల్ క్రష్ అని ఊరికే అనలేదు. నేషన్ వైడ్ గానే కాకుండా.. నేషన్ ని పాలించే ప్రధాని మనసుని సైతం గెలుచుకుందీ బ్యూటీ. ఒకే ఒక్క వీడియో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది.

మోదీ మనసు గెలుచుకున్న నేషనల్ క్రష్.. రష్మిక వీడియోకి ప్రధాని రిప్లై

ప్రధాని నరేంద్ర మోదీ 70 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా చురుకుగా పని చేస్తున్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. అంత బిజీ షెడ్యూల్ లో ప్రజలతో కాంటాక్ట్ లో ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. దేశం గురించి, ప్రజల గురించి, అభివృద్ధికి సంబందించిన ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా రష్మిక వీడియోకి స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. రష్మిక ఇటీవల ముంబైలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ముంబైలో రీసెంట్ గా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎంటీహెచ్ఎల్) బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్థం అటల్ సేతు అని పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ బ్రిడ్జిపై రష్మిక మొదటిసారిగా ప్రయాణం చేసింది. కారులో వెళ్తూ బ్రిడ్జి గురించి తన అనుభవాలను ఒక వీడియో రూపంలో పంచుకుంది. 2 గంటల్లో వెళ్లే ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చునని వీడియోలో తెలిపింది. భారతదేశంలో సాధ్యం కానిది ఏదీ లేదని.. గత పదేళ్లలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని వెల్లడించింది. ఈ అటల్ సేతు నిర్మాణం కేవలం ఏడేళ్లలో పూర్తయ్యిందని తనకు రీసెంట్ గానే తెలిసిందని.. తొలిసారిగా బ్రిడ్జిని చూసినప్పుడు తనకు మాటలు రాలేదని తెలిపింది.

ప్రస్తుతం యువ భారతం అత్యంత వేగంగా దూసుకుపోతోందని.. భారతదేశం చాలా తెలివైన దేశమని.. యువత బాధ్యతగా అభివృద్ధికి ఓటు వేయాలంటూ వీడియోలో పేర్కొంది. అలానే వీడియోని షేర్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేసింది. ‘దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకూ, తూర్పు భారతదేశం నుంచి పశ్చిమ భారతదేశం వరకూ ప్రజలను కలిపి ఉంచుతుంది. అందరి హృదయాలను కలుపుతుంది. లవ్ మై ఇండియా’ అంటూ ట్వీట్ చేసింది. ట్వీట్ తో పాటు ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రధాని మోదీని ఆకర్షించడంతో ఆయన స్పందించారు. రష్మిక ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. ఖచ్చితంగా! ‘ప్రజలను కలపడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైన విషయం మరొకటి లేదు’ అంటూ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ అటల్ సేతు ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ లోని నహవా శేవాను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. 21.8 కి.మీ. పొడవైన ఈ వంతెనను 6 లేన్లతో 21,200 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ బ్రిడ్జి 16 కి.మీ. వరకూ అరేబియా సముద్రంపై ఉంది. దీంతో దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పొడవైన సముద్ర వంతెనగా అటల్ సేతు రికార్డుకెక్కింది. మరి రష్మిక వీడియోపై ప్రధాని మోదీ స్పందించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.