నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడుతూనే ఉన్నాయి. ఆ మధ్య టమాటా ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు తదితర కారణాల వల్ల టమాట ధరలు ట్రిపుల్ సెంచరీకి చేరువగా వచ్చాయి. టమాట తర్వాత ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది. ఉల్లి ధరలు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. ఉల్లిని కొనేందుకు సామాన్యులు జంకుతున్నారు. పెరుగుతున్న ఉల్లి ధరలను కట్టడి చేసి, దేశీయంగా సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఉల్లి ధరల కట్టడిలో భాగంగా వాటి ఎగుమతుల మీద 40 శాతం సుంకాన్ని విధించింది కేంద్ర సర్కారు. దీంతో పాటు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) ఆధ్వర్యంలో ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉల్లి ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధిక ధరకు ఉల్లిని కొనలేని వారు కొన్ని నెలల పాటు వాటిని తినకుంటే బెటర్ అని దాదా భూసే అన్నారు.
రూ.10 లక్షల విలువైన కార్లను వినియోగిస్తున్నప్పుడు.. రిటైల్ ధర కంటే రూ.10 నుంచి రూ.20 ఎక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేయొచ్చు కదా? అని దాదా భూసే ఎదురు ప్రశ్నించారు. పెరిగిన ధరల ప్రకారం ఉల్లిని కొనలేకపోతే.. రెండు, మూడు నెలలు వాటిని తినడం మానేయాలని భూసే సూచించారు. ఉల్లి ధరలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయన్నారు. వాటి ధర కొన్నిసార్లు క్వింటాల్‌కు రూ.200 పలికితే.. మరికొన్ని సందర్భాల్లో క్వింటాల్ ధర రూ.2,000గా ఉంటుందన్నారు దాదా భూసే. ఉల్లి ధరకు సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు.