కూతురుకు అరుదైన వ్యాధి.. కంటికి రెప్పలా కాపాడుకుని ఉత్తమ విద్యార్థినిగా మలిచిన తల్లి

Kerala Mother Sheeba: ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలు దక్కించుకునేందుకు పోరాడింది. చావును ఓడించి బిడ్డను గెలిపించింది. కూతురుకి అరుదైన వ్యాధి ఉన్నప్పటికీ కాపాడుకుని బెస్ట్ స్టూడెంట్ గా తీర్చిదిద్దింది.

Kerala Mother Sheeba: ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలు దక్కించుకునేందుకు పోరాడింది. చావును ఓడించి బిడ్డను గెలిపించింది. కూతురుకి అరుదైన వ్యాధి ఉన్నప్పటికీ కాపాడుకుని బెస్ట్ స్టూడెంట్ గా తీర్చిదిద్దింది.

సృష్టికి దైవం అమ్మ. ఎన్ని జన్మలెత్తిన తల్లి రుణం తీర్చుకోలేనిది. నవ మాసాలు మోసి, పురిటి నొప్పుల బాధను భరించి బిడ్డను కని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. బిడ్డే లోకంగా జీవిస్తుంది. తాను పస్తులుండి కూడా బిడ్డల కడుపు నింపుతుంది. వారికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా విలవిల్లాడిపోతుంది. బిడ్డల భవిష్యత్తుకై ఆరాటపడుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పోషించుకుని వారిని ప్రయోజకులను చేసేంత వరకు అలుపెరుగని పోరాటం చేస్తుంది. అందుకే తల్లిని దైవంతో సమానంగా పూజిస్తాము. తల్లిని మించిన యోధులెవ్వరు లేరన్నది జగమెరిగిన సత్యం. కన్నబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. తన బిడ్డకు వచ్చిన ఆపద తొలిగిపోవాలని మొక్కని రాయి ఉండదు తిరగని గుడి ఉండదు.

ఈ క్రమంలో ఓ తల్లి తన బిడ్డ కోసం పెద్ద సాహసమే చేసింది. బిడ్డకు జన్మనిస్తే ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఆమె వెనకడుగు వేయలేదు. పుట్టిన బిడ్డ ప్రాణాలతో ఉంటుందో లేదో అని డాక్టర్లు చెప్పినప్పటికీ తన నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. తన బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలని సంకల్పించింది. పసిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మామూలు మనిషిని చేసింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న కూతురును ఉత్తమ విద్యార్థినిగా మలిచి రికార్డులు వరించేలా చేసింది. అనారోగ్యాలకు గురైన పిల్లల్ని వదిలించుకునే కసాయి తల్లులున్న ఈ రోజుల్లో బిడ్డ ప్రాణాల కోసం పోరాడింది. కన్నతల్లి ప్రేమకు అసలైన ప్రతిరూపంగా నిలుస్తోంది. ఆమె మరెవరో కాదు కేరళకు చెందిన షీబా. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలీ కేరళకు చెందిన షీబాను 2007లో వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత జీబా గర్భం దాల్చింది. అయితే షీబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తల్లి కావడం కష్టమని వైద్యులు తెలిపారు. బిడ్డకు జన్మనిస్తే తల్లి ప్రాణాలకు ముప్పు అని డాక్టర్లు హెచ్చరించారు. ప్రాణాలు పోయినా సరే బిడ్డను కనాలని నిర్ణయించుకుంది షీబా. 2017లో కేరళలోని మలప్పురం ఆస్పత్రిలో ఐదు నెలల బిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే 500 గ్రాముల బరువుతో బిడ్డ పుట్టింది. దీనికి తోడు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో బిడ్డ బతకడం కష్టమని వైద్యులు వెల్లడించారు. అయినా షీబా ధైర్యాన్ని కోల్పోలేదు. పాపను బతికించుకోవడానికి తనే వైద్యురాలిగా మారింది. జీవనోపాధి కోసం మస్తాన్‌ సౌదీ వెళ్లగా, బిడ్డను రక్షించుకోవడానికి షీబా ఒంటరిగానే శ్రమించారు.

ఏడాది పాటు ఇంట్లోని ప్రత్యేక గదిలో గుండె సంబంధ పరికరం అమర్చి ఇంక్యుబేటర్‌లో బిడ్డను కంటికి రెప్పలా చూసుకుని పునర్జన్మనిచ్చింది. ఆ కూతురే అయత్. ఆమెకు ఆరేళ్లు రాగానే కేరళలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. నాలుగేళ్ల వరకూ మాటలు రాని అయత్ టీవీలో షారూక్ ఖాన్‌ పాటలు చూస్తూ, షారుఖ్ అని పిలుస్తూ మాట్లాడింది. షారుఖ్‌లా టీవీలో కనిపించాలంటే ఏం చేయాలని తల్లిని అడిగింది. రోజూ పాఠశాలకు వెళ్లి బాగా చదువుకోవాలని చెప్పడంతో, అయత్ సెలవు పెట్టకుండా బడికి వెళ్లింది. అరుదైన వ్యాధితో బాధ పడుతూ బడికి వెళ్లే చిన్నారిగా అయత్ రికార్డు సృష్టించింది.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సహా పలు సంస్థల రికార్డులు అయత్‌ను వరించాయి. అయత్‌ను చూసి తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయత్‌ను కలెక్టర్ చేయాలని తల్లిదండ్రులు ఆశయంగా పెట్టుకున్నారు. అయత్ కు షారుఖ్ ఖాన్, రాహుల్ గాంధీని కలవాలనే కోరికలు ఉన్నాయని వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తున్నామని అయత్ తండ్రి మస్తాన్ అలీ తెలిపాడు. కూతురుకు అరుదైన వ్యాధి ఉన్నప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుని ఉత్తమ విద్యార్థినిగా మలిచిన తల్లిపై మీ అభిప్రాయాలనకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments