Kolkata: కోల్‌కతా హత్యాచార ఘటన.. ఇక వైద్యుల కోసం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Kolkata Doctor Case-Supreme Court: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Kolkata Doctor Case-Supreme Court: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై చోటు చేసుకున్న దారుణ హత్యాచార ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న వైద్యురాలిపై అత్యంత పాశవీకంగా జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించారు. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక్క రోజు వైద్య సేవలు బందు చేసింది. ఇక ఈ కేసును సుమోటోగా తీసుకున్న దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మంగళవారం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్బంగా తీవ్రంగా స్పందించింది. అంతేకాక పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే వైద్యుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

కేసును విచారించిన సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యురాలిని ఇంత దారుణంగా హతమారిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పారంటూ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను నిలదీసింది. ఆయనను ఆ కాలేజీ నుంచి తొలగించి.. మరోచోట ప్రిన్సిపల్‌గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కొన్ని మీడియాల్లో బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యుల భద్రత కోసం జాతీయ స్థాయిలో టాస్క్ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ  చేసింది.

దారుణం చోటు చేసుకున్నరోజు ఉదయాన్నే నేరాన్ని గుర్తించారు, కానీ ప్రిన్సిపల్‌ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైందని మండిపడింది. రాత్రి 8 గంటల సమయంలో మృతదేహాన్ని అంత్యక్రియలకు  అప్పగిస్తే.. ఆపై 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అందుకు కారణం ఏంటని.. ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది.

‘వైద్య వృత్తుల్లో ఉండేవారు హింసకు గురవుతున్నారు… మహిళా డాక్టర్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి, పని ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయస్థాయి ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరం’ అని ధర్మాసనం వెల్లడించింది. ఇందుకోసం జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

టాస్క్‌ఫోర్స్‌లో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.

Show comments