Donald Trump: ట్రంప్‌ను పూరి జగన్నాథుడే కాపాడాడట! 48 ఏళ్ళ నాటి పుణ్యం ఇలా!

Puri Jagannath-Donald Trump: ట్రంప్‌ ఎన్నికల ర్యాలీ మీటింగ్‌లో కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి ట్రంప్‌ను పూరి జగన్నాథుడే కాపాడాడు అంటున్నారు. ఆ వివరాలు..

Puri Jagannath-Donald Trump: ట్రంప్‌ ఎన్నికల ర్యాలీ మీటింగ్‌లో కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి ట్రంప్‌ను పూరి జగన్నాథుడే కాపాడాడు అంటున్నారు. ఆ వివరాలు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. ట్రంప్‌ స్వల్పంగా గాయపడ్డాడు. అతడి చెవి వెనక నుంచి బుల్లెట్‌ దూసుకుపోయింది. ఇక దాడికి పాల్పడిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని 20 ఏళ్ల యువకుడు థామస్‌ మ్యాథ్యు క్రూక్స్‌గా గుర్తించారు ఎఫ్‌బీఐ అధికారులు. అతడి ఫొటోను ప్రచురించారు. ఇక ట్రంప్‌పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రపంచదేశాల అధ్యక్షులు పలువురు ఖండించారు. ఇదిలా ఉంటే.. పూరి జగన్నాథుడే ట్రంప్‌ను కాపాడాడు అని.. 48 ఏళ్ల క్రితం ట్రంప్‌ చేసిన పుణ్యమే ఇప్పుడు అతడిని ప్రమాదం నుంచి బయట పడేసిందని చెబుతూ చేసిన ఒక ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇంతకు ఈ ట్వీట్‌ ఎవరు చేశారు.. ట్రంప్‌ చేసిన పుణ్యం ఏంటి వంటి వివరాలు..

కాల్పుల ఘటన నుంచి ట్రంప్‌ను పూరి జగన్నాథే కాపాడాడు అంటూ కోల్‌కతాలోని ఇస్కాన్‌ టెంపుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాధారమణ్‌ దాస్‌ చెప్పుకొచ్చారు. అంతేకాక 48 ఏళ్ల క్రితం ట్రంప్‌ చేసిన పుణ్యమే అతడిని కాపాడింది అంటూ 1976 నాటి రథయాత్రను ప్రస్తావించారు. ఆ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీని గురించి రాధారమణ్‌.. తన ట్విట్టర్‌ ఖాతాలో ఇలా పోస్ట్‌ చేసుకొచ్చారు.

‘‘సరిగ్గా 48 ఏళ్ల ​క్రితం డొనాల్డ్‌ ట్రంప్‌ జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి సాయం చేశారు. 1976, జూలైలో జగన్నాథ రథయాత్ర కోసం.. రథాలను తయారు చేయడానికి ట్రంప్‌ తన ట్రైన్‌ యార్డ్‌ను వినియోగించుకునేందుకు అనుమతించాడు. ఇప్పుడు ప్రపంచమంతా జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో ట్రంప్‌ మీద దాడి జరగడం.. ఊహించని ఘటన. ఈ ప్రమాదం నుంచి ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు’’ అని నాటి సంఘటనను రాధారమణ్‌ దాసు గుర్తు చేసుకున్నారు.

‘‘1976లో ఎన్‌వైసీ వీధుల్లో జగన్నాథుని మొదటి రథయాత్ర జరిగింది. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్షియస్‌నెస్‌(ఇస్కాన్‌) న్యూయార్క్‌ నగరంలో రథయాత్రను నిర్వహించాలనుకున్నప్పుడు.. అనేక సవాళ్లు ఎదురుయ్యాయి. మరీ ముఖ్యంగా జగన్నాథుడిని ఊరేగించేందుకు రథాల తయారు చేసేందుకు పెద్ద ఖాళీ స్థలం అవసరం అయ్యింది. ఇందుకోసం తెలిసిన ప్రతి ఒక్కరిని సాయం కోరాం. కానీ ప్రతి ఒక్కరు కుదరదనే సమాధానమే చెప్పారు. ఇక మాకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆ తరుణంలో మేం ఈ సమస్య గురించి డొనాల్డ్‌ ట్రంప్‌ను సంప్రదించాం. ఈ విషయం తెలిసి చాలా మంది మమ్మల్ని నిరుత్సాహపరిచారు. ట్రంప్‌ ఇలాంటి విషయాలు నమ్మడు.. ఆయన కూడా మీకు నో చెబుతారనే చెప్పారు’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

‘‘మేం జగన్నాథుడి మీద భారం వేసి ట్రంప్‌ వద్దకు వెళ్లాం. మా సమస్య గురించి చెప్పాం. ఆశ్చర్యం మూడు రోజల్లో ఆయన నుంచి మాకు సానుకూల స్పందన వచ్చింది. తన పాత రైల్వే యార్డ్‌లో రథాలను నిర్మించుకోవడానికి ట్రంప్‌ మాకు అనుమతిచ్చాడు. ఈ విధంగా నాడు అమెరికాలో జగన్నాథుడి రథయాత్ర సాగేందుకు ట్రంప్‌ తన వంతు సహకారం అందిచారు. ఆ పుణ్యమే ఇప్పుడు ఆయనను దాడి నుంచి కాపాడింది’’ అంటూ నాడు ట్రంప్‌ చేసిన మేలును గుర్తు చేసుకుంటూ.. రాధారమణ్‌ దాస్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది.

Show comments