వీడియో: బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి!

  • Author singhj Published - 05:50 PM, Sun - 27 August 23
  • Author singhj Published - 05:50 PM, Sun - 27 August 23
వీడియో: బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి!

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సరైన సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడులో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్​లోని 24 పరగణాల జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. 24 పరగణాల జిల్లా, దుత్తపుకుర్​ పట్టణంలోని ఒక బాణసంచా పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం సంభవించిన దుత్తపుకుర్​​లోని బాణసంచా పరిశ్రమను అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు కంపెనీ పైకప్పు ఎగిరిపడింది. మంటల ధాటికి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి.. రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ పేలుడు ఘటన పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీకి కూత వేటు దూరంలోనే జరగడం గమనార్హం. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. వాళ్లు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.

పేలుడులో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనలో చుట్టుపక్కల ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. రూల్స్​కు విరుద్ధంగా జనావాసాల మధ్యే ఫ్యాక్టరీ నడుపుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ పేలుడు ఎలా సంభవించింది? ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? దీనికి మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను ప్రాథమిక దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Show comments