డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే రాయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జనరిక్ మందులు రాయకపోతే వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లెసెన్సును సస్పెండ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఎన్ఎంసీఆర్ఎంపీ) పేరుతో ఈ మేరకు జారీ చేసిన నిబంధనల్లో పేర్కొంది. కాగా, 2002లో భారత వైద్య మండలి జారీ చేసిన రూల్స్ ప్రకారం.. దేశంలోని ప్రతి డాక్టర్ జనరిక్ మందులనే ప్రిస్క్రైబ్ చేయాలనే సూచనలు ఉన్నాయి.
గతంలో భారత వైద్య మండలి జారీ చేసిన నిబంధనలను పాటించాలని ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా వ్యవహరించే డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పేర్కొనలేదు. అయితే తాజాగా ఆ రూల్స్ స్థానంలో ఎన్ఎంసీఆర్ఎంపీ నియమావళి-2023ను అమల్లోకి తీసుకొచ్చామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. ఇందులోని నిబంధనలను పాటించని డాక్టర్ల మీద చర్యలను కూడా పేర్కొన్నారు. దాని ప్రకారం.. ప్రతి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ తమ దగ్గరకు వచ్చే పేషెంట్స్‌కు జనరిక్ పేర్లతో మందులను రాయాలి. అంతేగానీ అనవసరమైన మందులు, అహేతుకమైన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ట్యాబ్లెట్లను సూచించకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు.
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. ఆ డాక్టర్లను హెచ్చరించడంతో పాటు వర్క్‌షాప్స్‌కు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారు. ఒకవేళ పదే పదే రూల్స్‌ను ఉల్లంఘిస్తే.. ఆ వైద్యుడి లైసెన్స్‌ను కొంతకాలం పాటు నిలిపివేయనున్నట్లు నిబంధనల్లో స్పష్టం చేశారు. డాక్టర్లు రాసే మందుల చీటీలో మెడిసిన్స్ పేర్లు తప్పకుండా క్యాపిటల్ అక్షరాల్లో రాయాలని ఎన్ఎంసీ రూల్స్‌లో పేర్కొంది. బ్రాండెడ్ మెడిసిన్స్‌తో పోలిస్తే జనరిక్ మందుల ధరలు 30 శాతం నుంచి 80 శాతం తక్కువగానే ఉన్నాయని తెలిపింది. కాబట్టి వాటిని ప్రిస్క్రైబ్ చేయడం ద్వారా వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లవుతుందని వివరించింది. మరి.. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.