iDreamPost
android-app
ios-app

ల్యాప్​టాప్​ల దిగుమతుల మీద ఆంక్షలు.. ధరలు పెరగడంపై కేంద్రం ఏమందంటే?

  • Author singhj Published - 12:42 PM, Fri - 4 August 23
  • Author singhj Published - 12:42 PM, Fri - 4 August 23
ల్యాప్​టాప్​ల దిగుమతుల మీద ఆంక్షలు.. ధరలు పెరగడంపై కేంద్రం ఏమందంటే?

ల్యాప్​టాప్​లు, ట్యాబ్లెట్లతో పాటు కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. కొరియా, చైనా లాంటి దేశాల నుంచి చేసే దిగుమతులను కట్టడి చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. ఇక మీదట కొన్ని రకాల ఉత్పత్తులను దిగమతి చేసుకునేందుకు దిగుమతిదారులు సర్కారు నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆంక్షల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ.. పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటి కంటే ప్రధానమైనదని వివరించారు.

ల్యాప్​టాప్​లు, ట్యాబ్లెటపై ప్రభుత్వ ఆంక్షల విధింపు అనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని.. వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని ఆ అధికారి చెప్పారు. దీనివల్ల దేశీయంగా ల్యాప్​టాప్​లు, పీసీల ధరలేమీ పెరగబోవని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే, ల్యాప్​టాప్​లు సహా ట్యాబ్లెట్లు, ఆల్​ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫారం కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతుల మీద వెంటనే నియంత్రణలు అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ) ఓ నోటిఫికేషన్​లో తెలిపింది. అయితే దీనికి కొన్ని సంద్భాల్లో మినహాయింపు ఉంటుందని పేర్కొంది.

ఆగస్టు 3వ తేదీ కంటే ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్​మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని డీజీఎఫ్​టీ స్పష్టం చేసింది. ఆగస్టు 4వ తేదీ నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే టెస్టింగ్, ఆర్​అండ్​డీ, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్​మెంట్​కు 20 ఐటమ్స్ వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్స్ తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ల్యాప్​టాప్, ట్యాబ్లెట్, పీసీ లేదా అల్ట్రా స్మాల్ ఫారం కంప్యూటర్లకూ మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. అయితే వీటీకి వర్తించే సుంకాలను మాత్రం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.