దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబురంగా జరుపుకుంటున్నారు అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు. అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిర్వహిస్తారని తెలిసిన విషయమే. అయితే రక్తం పంచుకుపుట్టిన వారే కాకుండా సొదర సమానులు అయిన వారికి కూడా రాఖీ కట్టే సంప్రదాయం మన దగ్గర ఉంది. ఇక రాఖీ పండుగకు ఎంత మంది రాఖీలు కడతారు? ఐదుగురు చెల్లెళ్లు లేదా అక్కలు ఉంటే ఐదుగురు కడతారు.. మహా అయితే పది మంది కడతారు. కానీ ఇతనికి ఏకంగా 7 వేల మంది రాఖీ కట్టి తమ ప్రేమను తెలియజేసుకున్నారు. మరి ఒక్కరికే 7 వేల మంది రాఖీలు కట్టడంలో ఉన్న ప్రేమ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘ఖాన్ సార్’.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలీకపోవచ్చు. కానీ బీహార్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. ఖాన్ సార్ ప్రముఖ ఆన్ లైన్ ట్యూటర్ గా బిహార్ లోనే కాక దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఈ క్రమంలోనే ఖాన్ సార్ పట్నాలో బుధవారం రక్షా బంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు అపూర్వ స్పందన లభించింది. ఆయన పిలుపు అందుకున్న వేలాది మంది ప్రస్తుత, పూర్వ విద్యార్థినులు పలు ప్రాంతాల నుంచి కోచింగ్ సెంటర్ కు తరలివచ్చారు. ప్రతీ ఒక్క విద్యార్థి తమ గురువును అన్నగా భావించి.. రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో దాదాపు 7 వేల మంది రాఖీ కట్టినట్లుగా ఖాన్ సార్ తెలిపారు. ప్రపంచంలోనే ఇదో అరుదైన రికార్డుగా ఆయన చెప్పుకొచ్చారు.
కాగా.. విద్యార్థినులు కొట్టిన రాఖీలతో ఖాన్ సార్ చేయి మెుత్తం నిండిపోయింది. ఇక తనకు అక్కా, చెల్లి లేరని అందువల్ల ప్రతీ ఒక్క విద్యార్థినిని తన సొదరిగా భావించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఖాన్ సార్ వెల్లడించారు. ప్రతీ సంవత్సరం ఇలాగే ఈ వేడుకలు నిర్వహిస్తానని, కానీ ఈ సంవత్సరం వచ్చినంత రెస్పాన్స్ ఏ సంవత్సరం కూడా రాలేదని ఆయన తెలిపారు. ప్రపంచంలో తనకు వచ్చినన్ని రాఖీలు మరే వ్యక్తికి కూడా వచ్చి ఉండవని ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఖాన్ సార్. కాగా.. ఖాన్ సర్ ఉత్తమ ఉపాధ్యాయుడని, మంచి సోదరుడని ఆయన లాంటి వ్యక్తి ఉండరని కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చిన విద్యార్థినులు చెప్పడం గమనార్హం. మరి ఒకే వ్యక్తికి 7 వేల మంది రాఖీలు కట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.