iDreamPost
android-app
ios-app

2022 ఆగస్ట్ – టాలీవుడ్ బంగారు బాతు

  • Published Aug 15, 2022 | 2:17 PM Updated Updated Aug 15, 2022 | 2:17 PM
2022 ఆగస్ట్ – టాలీవుడ్ బంగారు బాతు

ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడని రీతిలో ఆగస్ట్ నెల ఇంకా సగం పూర్తి కాకుండానే ఏకంగా మూడు సూపర్ హిట్లు దక్కడం ఇండస్ట్రీని ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. జూలైలో ఒకటి రెండు కాదు అయిదు డిజాస్టర్లు రావడం మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే, ది వారియర్, థాంక్ యు, రామారావు ఆన్ డ్యూటీ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టడంతో పంపిణీదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం థియేటర్ల రెంట్లు కూడా కట్టుకోలేక వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్లు పెట్టిన ఎగ్జిబిటర్లు ఉన్నారు. అయినా కూడా ఫలితం దక్కలేదు. ఎంతలేదన్నా సుమారు అరవై కోట్లకు పైగానే నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది

కానీ ఇప్పుడు ఆజాదీ అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఆగస్ట్ మాత్రం టాలీవుడ్ కు బంగారు బాతులా మారింది. బింబిసార మొదటి బోణీ కొట్టింది. 16 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేస్తే కేవలం పది రోజులకే 30 కోట్ల దగ్గరకు వెళ్లి పధ్నాలుగు కోట్లకు పైగానే లాభాలు ఇచ్చి ఇంకా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తోంది. మాస్ లో అంచనాలు లేకుండా వచ్చిన సీతారామం చేసుకున్న బిజినెస్ 17 కోట్ల దాకా ఉండగా ఇప్పటిదాకా వచ్చిన ప్రాఫిట్ 7 కోట్ల పైమాటే. బ్రేక్ ఈవెన్ రెండో వారంలోనే జరిగిపోయింది. ఈ జానర్ మూవీస్ ఇలాంటి ఫీట్ సాధించడం చాలా అరుదు. ఈ రెండు సినిమాలు ఇంకో వారం పది రోజులు ఇదే తరహా రన్ కొనసాగిస్తాయని ట్రేడ్ అంచనా

ఇక కార్తికేయ 2 విషయానికి వస్తే రెండు రోజులకే 10 కోట్లకు పైగా షేర్ లాగేసింది. జరిగిన బిజినెస్ కేవలం 13 కోట్లు. అంటే ఇవాళ బ్రేక్ ఈవెన్ ఈజీగా పూర్తి చేసుకుని రేపటి నుంచి వచ్చే ప్రతి రూపాయి లాభం కిందకే వస్తుంది. మాచర్ల నియోజకవర్గం కోసం ఎక్కువ థియేటర్లను బ్లాక్ చేసి ఉంచారు. కానీ దానికి డిజాస్టర్ టాక్ రావడం వల్ల రెండో వారం అంటే 19వ తేదీ నుంచి కార్తికేయ 2కు అదనంగా స్క్రీన్లు తోడవుతాయి. మరోవైపు నార్త్ లోనూ ఇదే తరహా దూకుడు కనిపిస్తోంది. గురువారం దాకా లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లను కొనసాగించి వెంటనే తీసేసి కార్తికేయ 2 హిందీ వెర్షన్ ని వేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారు. మొత్తానికి ఆగస్ట్ బంగారు నెల సెంటిమెంట్ ని లైగర్ ఎలా కొనసాగిస్తుందో చూడాలి.