iDreamPost
iDreamPost
1999లో నరసింహ విడుదలైనప్పుడు రేగిన సంచలనం అప్పుడు థియేటర్లలో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. ముఖ్యంగా రజినీకాంత్ రమ్యకృష్ణల హీరో విలన్ కెమిస్ట్రీని అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఇద్దరి కెరీర్ బెస్ట్ లో ఇది నెంబర్ వన్ అని అభిమానులు చెప్పుకుంటారు. అంతగా దీని ప్రభావం రెండు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఉంది. టీవీలో వచ్చిన ప్రతిసారి సూపర్ టిఆర్పిని నమోదు చేస్తూనే ఉంది. ఆ మధ్య సన్ టీవీలో ఏడేళ్ల తర్వాత రీ టెలికాస్ట్ చేస్తే ఏకంగా 20కి పైగా రేటింగ్ తెచ్చుకుని అబ్బురపరిచింది. ఆ స్థాయిలో దీని మేజిక్ జెనెరేషన్స్ తరబడి పని చేస్తూనే ఉంది. క్లాసిక్ అనే మాట చిన్నదే.
ఇక విషయానికి వస్తే ఈ కలయిక మళ్ళీ సాధ్యం కాబోతోందని చెన్నై టాక్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించబోయే భారీ సినిమాలో మరోసారి నెగటివ్ క్యారెక్టర్ చేసేందుకు రమ్యకృష్ణ ఓకే చెప్పారట. అఫీషియల్ గా బయటికి రాలేదు కానీ ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యిందని కోలీవుడ్ టాక్. నెల్సన్ ఇటీవలే బీస్ట్ రూపంలో డిజాస్టర్ అందుకున్నాడు. వంద కోట్ల పైమాటే వసూళ్లు వచ్చాయి కానీ కెజిఎఫ్ 2 దెబ్బకు స్వంత రాష్ట్రం తమిళనాడులోనూ ఫ్లాప్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. కాకపోతే అంతకు ముందు డాక్టర్, కోకోకోకిలను హ్యాండిల్ చేసిన తీరు అభిమానుల్లో నమ్మకం ఉండేలా చేసింది.
తెలుగు మార్కెట్ బాగా దెబ్బ తిన్నప్పటికీ రజనీకాంత్ సినిమాల స్పీడ్ తగ్గించడం లేదు. రోబో తర్వాత ఆ స్థాయి సక్సెస్ తనకు మళ్ళీ ఇక్కడ దక్కనే లేదు. పెద్దన్న అయితే మరీ ఘోరం. సగం పెట్టుబడి కూడా వెనక్కు తేలేక తుస్సుమంది. కొత్త జెనరేషన్ దర్శకులతో చేస్తున్నా తలైవాకు పరాజయాలు తప్పడం లేదు. మరి స్టైల్ తో పాటు డార్క్ కామెడీని బాగా మిక్స్ చేసుకునే నెల్సన్ ఈసారి ఎలాంటి సబ్జెక్టులో రజనిని చూపిస్తాడో వేచి చూడాలి. వయసు మీదపడుతున్నా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే ఉన్న రజనికి నరసింహ లాంటి సరైన సబ్జెక్టు పడాలే కానీ పాత రికార్డుల తుప్పు లేపడం ఎంతసేపు.