Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుధవారం ఉదయం ఆయన తన స్టూడియోలో ఉరి వేసుకుని మరణించారు. నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. స్వాధీనం చేసుకున్న నితిన్ దేశాయ్ ఫోన్‌లో పోలీసులు ఓ ఆడియోను గుర్తించారు. ఆ ఆడియోలో మొత్తం నలుగురి పేర్లను నితిన్ దేశాయ్ చెప్పుకొచ్చారు.
దీంతో పోలీసులు సదరు నలుగురు వ్యక్తులకు సమన్లు పంపే పనిలో ఉన్నారు. త్వరలో వారిని కూడా విచారించనున్నారు. విచారణలో వారికి.. నితిన్ దేశాయ్ మరణానికి గల సంబంధం ఏంటన్నది తెలియ వచ్చే అవకాశం ఉంది. ఇక, నితిన్ ఆత్మహత్య చేసుకోవటానికి భారీ అప్పులే కారణంగా తెలుస్తోంది. ఆయన 2016లో దాదాపు 189 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లు సమాచారం. ఆ మొత్తం వడ్డీతో కలిపి ఇప్పుడు 249 కోట్ల రూపాయలు అయినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఆయన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. 2020నుంచి అప్పులు తిరిగి చెల్లించటంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అప్పులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కాగా, నితిన్ దేశాయ్ ఆర్ట్ డైరెక్టర్‌గా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. దేవ్‌దాస్, హమ్ దిల్ దే చుకే సోనమ్, జోదా అక్బర్, లగాన్ వంటి ఎన్నో హిట్ సినిమాలకు పని చేశారు. ‘దాదా సాహెబ్ అంబేద్కర్’.. ‘హమ్ దిల్ దే చుకే సోనమ్’.. ‘లగాన్’.. ‘దేవ్‌దాస్’ సినిమాలకు గాను ఆయనకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవటంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోఖ సంద్రంలో మునిగిపోయింది.