అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్: సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్

మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, ఇష్టాయిష్టాలకు అద్దం పడుతూ ఇటీవల వస్తున్న సినిమాలు తెలుగు సినిమా పరిణితికి గీటురాళ్ళుగా ఉన్నాయని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు. అందుకు నిదర్శనమే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. పేరు వినగానే ఏదో అకతాయిగా అనిపించినా, సినిమా కథగా, తెరరూపం పొందిన తర్వాత చాలా ప్రత్యేకత కలిగిన చిత్రమని చెప్పాలి. ముఖ్యంగా భారీ ఇమేజ్ ఉన్న అనుష్కశెట్టి, జాతిరత్నాలు చిత్రంతో కామెడీ, ఎంటర్టైన్మెంట్లకి తనదైన మార్క్ సాధించిన నవీన్ పోలిశెట్టి కాంబినేషన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్.. ఈ మూడు అంశాలూ సినిమాకు ప్లస్ పాయింట్స్. కాగా.. సినిమాకి మాస్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకూ అందరూ ఎదురుచూసిన సినిమాగా విడుదలకు ముందే భారీ బజ్ ను క్రియేట్ చేసింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. బాలీవుడ్ బాద్షా ‘జవాన్’ సినిమాతో పోటీగా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని విడుదల చేసిన ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ క్వాలిటీ రివ్యూలను సాధించడం విశేషం.

కథ

కథ ప్రారంభంలోనే కొంతసేపటికి అన్విత(అనుష్కాశెట్టి) అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి(జయసుధ)ని కోల్పోతుంది. భర్తకి దూరమై తన చిన్ననాటి నుంచి తల్లి ఆవేదనను ప్రత్యక్షంగా చూసిన అన్విత వివాహబంధం పట్ల పూర్తిగా నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది. కానీ, జీవితంలో తనకి ఓ తోడు కావాలి, అది ఓ బిడ్డకి జన్మనివ్వడమే అందుకు పరిష్కారం అనుకున్న అన్విత మోడర్న్ సైన్స్ ఫలితంగా ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీనే ఎంచుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా స్టాండప్ కామెడీతో గొప్పవాడు కావాలని కలలు కంటున్న సిద్ధార్ధ పోలిశెట్టిని కలుస్తుంది. తన ఆలోచనని పూర్తిగా సిద్ధార్థకి చెప్పేలోగానే అన్విత ప్రేమలో పడతాడు సిద్ధార్ధ. అన్విత తనని తరచూ కలుస్తూ, తన గురించి ఆరా తీస్తుంటే తను కూడా ప్రేమలో పడిందని, తన కన్నా వయసులో అన్విత పెద్దదయినా సరే తప్పులేదని తల్లిదండ్రులతో వాదించే స్థాయికి చేరుకుంటాడు. కానీ, తర్వాత జరిగిన కథలో అన్విత ఆలోచనలు తెలుసుకున్న సిద్ధార్థ అవాక్కయిపోతాడు. అన్వితని వదులుకోలేక అలాగని ఆమె ఆలోచనతో ఏకీభవించలేని సందిగ్ధావస్థలో ఉండగానే అన్వితకి అవసరమైన స్పెర్మ్ ని అందజేస్తాడు. దీంతో అన్విత గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాతే సిద్ధార్థలో సెంటిమెంట్ని అన్విత అర్ధం చేసుకుంటుంది. చివరికి ఇద్దరూ ఒకటవుతారు.

ఎవరెలా చేశారంటే?

నేచురల్ గానే నవీన్ పోలిశెట్టిలో ఉన్న కామెడీ, ఎంటర్టైన్మెంట్ టైమింగ్ సిద్ధార్ధ్ క్యారెక్టర్కి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. దాదాపుగా ఫస్టాప్ మొత్తం నవీన్ టాలెంటే సినిమాకి ప్రాణం. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నిటితో థియేటర్ ఈలలు, కేకలతో నిండిపోయింది. క్రియేటెడ్ క్యారెక్టర్ని అంత నేచురల్ గా నవీన్ నటన సినిమాకి తిరుగులేని అడ్వాంటేజ్. అనుష్కలాంటి పెద్ద హీరోయిన్ తో ఎక్కడా తగ్గకుండా తన ఏజ్ క్యారెక్టర్ని నవీన్ అద్భుతంగా పండించాడు. ఫస్టాఫ్ లో నవీన్ వెనక పరిగెత్తే పాత్రగా మాత్రమే రిజిస్టర్ అయిన అనుష్క గర్భవతి అయిన తర్వాత సెకండాఫ్ మొత్తం తన భుజాల మీద మోసుకెళ్ళింది. ఎంతో నిండుగా, సైన్స్ నే ఆశ్రయించినప్పటికీ, సంప్రదాయంలో, భార్యాభర్తల బంధలో ఉండే లోతైన ఎమోషన్ ని డైలాగ్ లు ఎక్కడా లేకపోయినా అనుష్క రక్తికట్టించింది. బాహుబలి, రాణిరుద్రమ, భాగమతి చిత్రాలతో భారీ పాత్రలకు అలవాటు పడిపోయిన అనుష్క ఇలాంటి సెంటిమెంట్, సెన్సిటివ్ పాత్రలో నటించడం ప్రేక్షకులకి ఓ విభిన్నమైన అనుభూతి. అనుభవం. ఇక మిగిలిన నటుల్లో మురళీశర్మ, తులసి, తదితరులు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.

టెక్నికల్ వ్యాల్యూస్

కమర్షియల్ వ్యాల్యూస్ ప్లస్ గ్రాండ్ క్యాస్టింగ్ రెండూ కలిపి దర్శకుడు మహేష్ చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రంలో ప్రతీ సీను చాలా బాగా పండింది. సినిమాలో ఏ సన్నివేశం కూడా అనవరం అనిపించనంత కరెక్టుగా స్క్రీన్ ప్లేని రాసుకున్న మహేష్ ఈ కొత్తకథను ఎంతో కన్విన్సింగ్ గా నడిపించాడు. ప్రతీ డైలాగూ పేలింది. క్లైమాక్స్ వరకూ కథని ఎక్కడా బోర్ కొట్టకుండా షార్ప్ గా తెరకెక్కించాడు మహేష్. సినిమాటోగ్రాఫీ గానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ సినిమాని ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి.

ప్రొడక్షన్ క్వాలిటీ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. భారీ బ్యానర్ గా పేరుపడ్డ యూవీ క్రియేషన్స్ ఇటువంటి సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ కథని నిర్మించడానికి ముందుకు రావడం ఎంతైనా మెచ్చుకుతీరాలి. మాకెందుకులే..పెద్ద సినిమాలు తీసుకుంటే చాలు అనుకుని ఉంటే ఈ సినిమా వచ్చి ఉండేదే కాదు. ఇటువంటి కథలను యూవీ క్రియేషన్స్ లాంటి సంస్థ ప్రోత్సహించడం, అది ప్రేక్షకుల అభినందనలు పొందడం వంటి పరిణామాలు సినిమా పరిశ్రమలో సరికొత్త దర్శకులకు, వాళ్ల ఆలోచనలకు ఊపిరి పోస్తాయి, ఊతమిస్తాయి. కంగ్రాట్యులేషన్స్.. యూవీ క్రియేషన్స్.

చివరిమాట: మాస్, క్లాస్, ఫ్యామిలీస్, అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ – సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్

Show comments