iDreamPost
android-app
ios-app

రచ్చకు దారి తీసిన మెగా ఫ్యాన్స్ మీటింగ్

  • Published May 24, 2022 | 11:26 AM Updated Updated May 24, 2022 | 11:42 AM
రచ్చకు దారి తీసిన మెగా ఫ్యాన్స్ మీటింగ్

నిన్న సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ VS అల్లు అర్జున్ అభిమానుల రచ్చ ఓ రేంజ్ లో జరిగింది. రెండు రోజుల క్రితం విజయవాడలో మెగా ఫ్యాన్స్ మీటింగ్ ఒకటి జరిగింది. అధికారిక సంఘాల సూచనల మేరకు రెండు రాష్ట్రాల నుంచి కీలక సభ్యులు అందులో పాల్గొన్నారు. కానీ బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి అదుపు తప్పడంతో ట్విట్టర్ లో లేనిపోని రగడకు కారణమయ్యింది. అసలేం జరిగిందో చూద్దాం. అఖిల భారత చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు భవాని రవి కుమార్ గతంలో ఎప్పుడో అల్లు అర్జున్ అన్న చెప్పను బ్రదర్ సంఘటనను బయటికి తెచ్చి ఇకపై బన్నీ సినిమాలు ఆడనివ్వమని ఊగిపోతూ ఏదేదో నోటికొచ్చినట్టు అనేశాడు.

ఆ వీడియో కాస్తా బయటికి రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అసలు తమ హీరో సినిమాను ఎలా అడ్డుకుంటారని, పుష్పతో ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ ని ఎవరూ ఏమి చేయలేరని ఎదురు దాడికి దిగారు. ఎప్పుడో ఏళ్ళ క్రితం జరిగిపోయి అందరూ మర్చిపోతున్న టైంలో రవి కుమార్ పాత ఇన్ సిడెంట్ ని మళ్ళీ తెరపైకి తీసుకురావడం అర్ధరహితం. ఈ వ్యవహారం కాస్తా మెగా అల్లు ఫ్యామిలీల దాకా రీచ్ కావడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రవికుమార్ క్షమాపణ చెబుతూ మరో వీడియో విడుదల చేశాడు. చిరు చరణ్ బన్నీలతో పాటు ఇతర అభిమానులు అందరికీ సారీ చెబుతూ మళ్లీ రిపీట్ చేయనని విచారం వ్యక్తం చేశాడు

నిజానికి ఆ మీటింగ్ జరిగింది జనసేనను వచ్చే ఎన్నికల్లో గెలిపించడం గురించి. అందరు మెగా హీరోల ఫ్యాన్స్ ఏకం కావడం గురించి. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లో అల్లు అర్జున్ ఫోటో లేకపోవడం నుంచి రగడ మొదలయ్యింది. ఆ తర్వాత పలు కథనాలు రావడం అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ వీడియో హల్చల్ చేయడం వాతావరణాన్ని వేడెక్కించాయి. అసలు తామంతా ఒకటే అని హీరోలు పదే పదే చెబుతున్నా ఇలాంటి విబేధాలు అభిమానుల మధ్య రావడం దురదృష్టకరం. ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేయడం, వాటిని ఇతరులు వైరల్ చేయడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఇప్పటికైనా గుర్తించాలి. అంత పరిపక్వత వస్తుందని ఆశిద్దాం