iDreamPost
iDreamPost
సోషల్ మీడియా వచ్చాక అసలు ఐడెంటిటీని దాచుకుని ఫేక్ ప్రొఫైల్స్ తో ఫలానా హీరోల ఫ్యాన్సని చెప్పుకుంటూ అవతలి వాళ్ళ మీద బురద జల్లే బ్యాచులు పెరిగిపోతున్నాయి.మేము గొప్పంటే మేము గొప్పంటూ ఓపెనింగ్స్ గురించి కలెక్షన్ల గురించి చేసుకుంటున్న ట్రోలింగ్ శృతి మించి పోతోంది. కొన్ని సందర్భాల్లో ఇది వికృత రూపం కూడా దాలుస్తోంది. మొన్న విడుదలైన సర్కారు వారి పాట వసూళ్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ స్వయంగా నాన్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఇచ్చిన ఫిగర్స్ తర్వాత ఈ రచ్చ మొదలైంది. ఇది అబద్ధమంటూ ఒకరు లేదు ఓర్వలేక అంటున్నారని మరొకరు ఇలా సాగుతోంది.
కొంచెం వెనక్కు వెళ్తే ఈ తరహా ట్రోలింగ్ లు సన్ అఫ్ ఇండియా టైం నుంచి ఎక్కువయ్యాయి. ఆ సినిమా థియేటర్లలో జనం గురించి వచ్చిన మీమ్స్ చూసి ఒకదశలో మంచు విష్ణు లీగల్ వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కాస్త ఈ ట్రోలర్స్ దూకుడు తగ్గింది కానీ పూర్తిగా కట్టడి చేయడం సాధ్యపడలేదు. ఇక ఆచార్య వచ్చాక ఇదింకో స్టోరీ. మొదటి రోజు బెనిఫిట్ షోల నుంచే టాక్ దారుణంగా తేడా కొట్టడంతో దీన్ని టార్గెట్ చేసినవాళ్లు ట్విట్టర్ లో, ఇన్స్ టాలో పండగ చేసుకున్నారు. ఫలానా హీరోల ఫ్యాన్సే చేశారని చెప్పడానికి లేదు. ఆ మాటకొస్తే ఫేస్ బుక్ కానీ మరో ప్లాట్ ఫార్మ్ కానీ ఎందులోనూ సదరు వ్యక్తుల ధృవీకరణ ఉండదు.
దీన్ని అవకాశంగా తీసుకునే యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు సర్కారు వారి పాట వచ్చి మూడో రోజు అవుతోంది. బుక్ మై షో, పేటిఎం యాప్స్ నుంచి సీట్లు ఫుల్ కాని స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి ఒక వర్గం ఫ్లాప్ అంటుంటే, మరో వర్గం ఇదిగో కలెక్షన్లంటూ ఫిగర్లను చూపిస్తోంది. ఎవరిది రైట్ ఎవరిది రాంగనేది చెప్పడం కష్టం కానీ ఎవరి వ్యక్తిగత ఉద్దేశాలతో వాళ్ళు తమ తమ పనులు కానిచ్చేస్తున్నారు. అయినా డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కూడా ఈ స్థాయిలో కలెక్షన్ల గురించి ఆలోచిస్తున్నారో లేదో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలా గ్రూప్స్ విడిపోయి పరస్పరం బురద జల్లుకోవడం ఎక్కడిదాకా వెళ్తుందో కాలమే సమాధానం చెప్పాలి