Krishna Kowshik
కోలీవుడ్, మాలీవుడ్ స్టార్ నటుడు అరెస్ట్ అయ్యాడు. తనను, తన పాపను మానసికంగా హింసిస్తున్నాడంటూ మాజీ భార్య ఫిర్యాదు మేరకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
కోలీవుడ్, మాలీవుడ్ స్టార్ నటుడు అరెస్ట్ అయ్యాడు. తనను, తన పాపను మానసికంగా హింసిస్తున్నాడంటూ మాజీ భార్య ఫిర్యాదు మేరకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Krishna Kowshik
పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన సినీ సెలబ్రిటీల్లో కొంత మంది వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఆడ వాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలయ్యారు. కన్నడ స్టార్ దర్శకుడు దర్శన్ తూగదీప, రాజ్ తరుణ్, జానీ మాస్టర్ వంటి స్టార్లను మహిళలకు సంబంధించిన ఇష్యూస్ చుట్టుముట్టాయి. రాజ్ తరుణ్ మినహా మిగిలిన ఇద్దరు జైలు జీవితాన్ని చూసిన వారే.. చూస్తున్న వారే. పోనీ వీరిని చూసైనా మిగిలిన వారైనా జాగ్రత్త పడతారా అంటే.. అదీ కాదు.. దురుసుగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సొంత కూతుర్నే వేధించడంతో ప్రముఖ మలయాళ నటుడు బాలా కుమార్ అరెస్టు అయ్యాడు . ఆయన మాజీ భార్య అమృత సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు కూతుర్ని ఏమన్నాడు.. మాజీ భార్య ఏమని ఫిర్యాదు చేసిందంటే..?
తమిళనాడుకు చెందిన బాలా కుమార్ మలయాళ ఇండస్ట్రీలో వెరీ ఫేమస్. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు శివకు సోదరుడు. ఇతడికి ప్రముఖ గాయని అమృతా సురేశ్ తో 2010లో వివాహం అయ్యింది. వీరికో పాప. అయితే వీరికి మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో ఎలిజబెత్ ఉదయాన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న బాలా.. ఈ ఏడాది విడాకులు ఇచ్చేశాడు. అయితే అప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా.. మాజీ భార్య అమృత, కూతురు అవంతిక పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి కౌంటరిచ్చింది అమృత. వీరి విషయంలోకి వచ్చింది కూతురు అవంతిక. తనను, అమ్మను గతంలో బాలా శారీరకంగా, మానసికంగా హింసించాడని వీడియో షేర్ చేసింది. అయితే ఈ వీడియోపై బాలా స్పందించాడు. ఈ విధంగానైనా తనను తండ్రిగా అంగీకరించకరించినందుకు థాంక్స్ అంటూ సెటైరికల్ రిప్లైయ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు తన జోలికి వచ్చినా ఊరుకున్న అమృతా సురేశ్. తన కూతురు జోలికి రావడంతో ఉపేక్షించలేదు. కేరళలోని కడవంట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తూ పరువుకి భంగం కలిగించడం, తన పాప పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కంప్లయింట్లో పేర్కొంది. దీంతో సోమవారం పోలీసులు బాలాను అరెస్టు చేశారు. కొచ్చిలో బాలా పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యాజమానిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బాలా దగ్గర మూడేళ్లుగా పనిచేసిన డ్రైవర్.. విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. కూతురు ఎదుటే అమృతపై చాలా సార్లు దాడి చేశాడని, ఇప్పుడు ఈ జంట విడిపోయారు కాబట్టే బయటపెడుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. ‘అమృత సురేష్ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేయడం వల్ల ఆమె శరీరంపై గాయాల తాలూకు మచ్చలు కూడా ఉన్నాయి. వాటికి ఇప్పటికీ చికిత్స తీసుకుంటుంది’ అంటూ డ్రైవర్ తెలిపారు.
బాలా విషయానికి వస్తే.. అతడి ఫిల్మీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దే. తాత అరుణాల స్టూడియోస్ యజమాని. ఆయన తండ్రి జయకుమార్ ప్రముఖ నటుడు. 350కి పైగా చిత్రాల్లో నటించాడు. అన్నయ్య తెలుగు, తమిళంలో ప్రముఖ దర్శకుడు శివ. తాజాగా కంగువాతో రాబోతున్నాడు. బాలా తన కెరీర్ తెలుగు ఇండస్ట్రీతోనే స్టార్ట్ చేశాడు. 2002లో తెలుగు చిత్రం టూ మచ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత 2003లో తమిళంలో అన్బు అనే చిత్రంలో నటించి అక్కడ కూడా ఆకట్టుకున్నారు. ఇంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకున్న బాల ఇప్పుడు మాజీ భార్యా బిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.