కిచ్చా సుదీప్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఈగ’ సినిమాతో తెలుగులో ఆయన స్టార్ ఇమేజ్ సంపాదించారు. ఆ మూవీలో నెగిటివ్ రోల్లో అద్భుతంగా యాక్ట్ చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా సుదీప్ వాయిస్‌కు తెలుగు వారు ఫిదా అయ్యారు. అయితే ‘ఈగ’ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు సుదీప్. ఒక్క ‘బాహుబలి’లోనే క్యామియో రోల్ చేశారు. సొంత ఇండస్ట్రీ శాండల్‌వుడ్‌లో మాత్రం రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నారాయన. గతేడాది ‘విక్రాంత రోణా’తో మర్చిపోలేని హిట్ అందుకున్నారు కిచ్చా సుదీప్. ఈ సినిమా అటు కన్నడతో పాటు ఇటు తెలుగు నాట కూడా మంచి హిట్‌గా నిలిచింది.
‘విక్రాంత రోణా’ తర్వాత తదుపరి ప్రాజెక్టులపై సుదీప్ ఫోకస్ చేస్తున్నారు. భారీ మూవీస్‌ను తీసే ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా 46కు సంబంధించిన టీజర్‌ను కూడా మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. ఇలాంటి తరుణంలో ఈ స్టార్ హీరోపై ఒక నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. తమ బ్యానర్లో ఒక మూవీ చేస్తానని చెప్పి.. రెమ్యూనరేషన్ కూడా తీసుకొని కిచ్చా సుదీప్ సినిమా చేయకుండా మోసం చేశారని ప్రొడ్యూసర్ ఎమ్ఎన్ కుమార్ ఆరోపించారు. కొత్త ప్రాజెక్ట్ కోసం సుదీప్ తమ నుంచి రూ.9 కోట్లు తీసుకున్నారని ఎమ్ఎన్ కుమార్ ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకొని డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని తెలిపారు.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర ఈ విషయంపై ఇప్పటికే కంప్లయింట్ చేశానన్నారు నిర్మాత ఎమ్ఎన్ కుమార్. తమ మధ్య సినిమా చేయడానికి సుమారు 8 ఏళ్ల కింద అగ్రిమెంట్ కుదిరిందన్నారు. కానీ ఇప్పటిదాకా కాల్షీట్స్ కేటాయించడంలో సుదీప్ ఫెయిలయ్యారని చెప్పుకొచ్చారు. పూర్తి రెమ్యూనరేషన్‌తో పాటు మరో రూ.10 లక్షలు తన ఇంటి కిచెన్ రెనోవేషన్ కోసం సుదీప్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్‌కు అడ్వాన్స్ చెల్లించడంతో పాటు మూవీకి ‘ముత్తటి సుబ్బరాజు’ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించామన్నారు నిర్మాత కుమార్. తన దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత వివిధ నిర్మాతలతో సుదీప్ నాలుగు సినిమాలు చేశాడని.. కానీ తమ బ్యానర్లో మాత్రం మూవీ చేయడం లేదన్నారు.