Venkateswarlu
Venkateswarlu
పై ఫొటోలో.. ఎర్రటి సర్కిల్‌లో యాక్షన్ హీరోలా నిల్చున్న ఆ పిల్లాడు ఇప్పుడు ఓ ప్యాన్ వరల్డ్ హీరో. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేశారు. ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం నటుడిగానే కాదు.. ప్రొడ్యూసర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, పాటల రచయితగా, దర్శకుడిగా బహుముఖ ప్రతిభను కనబరిచారు. ఇప్పటి వరకు 50కిపైగా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇందులో నాలుగు జాతీయ అవార్డులు కూడా ఉండటం విశేషం.
రూపం బక్కపల్చది అయినప్పటికి.. హీరోయిజంను పండించటంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది.. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరనేది. ఆ పిల్లాడు ఇంకెవరో కాదు.. ప్యాన్ వరల్డ్ స్టార్ ధనుష్ కస్తూరి రాజా. ధనుష్ అన్న సెల్వ రాఘవన్ దర్వకత్వం వహించిన ‘తుల్లువదో ఇల్లమయ్’ సినిమాతో వెండి తెరపైకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నటన విషయమై ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా.. ‘పుదుప్పేటై’ సినిమాలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
2012లో వచ్చిన 3 సినిమాతో నిర్మాతగా మారారు. అదే సినిమాలో ‘కొలవెరి డీ’ అనే పాటను రాసి, పాడి సంచలనం సృష్టించారు. పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ పకీర్ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ది గ్రే మ్యాన్ సినిమాతో హాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. సార్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. జులై 28న ధనుష్ పుట్టిన రోజు కావటం విశేషం.