Uppula Naresh
Uppula Naresh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28న విడుదలకు సిద్దంగా ఉంది. అయితే, ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళ్ ఇండస్ట్రీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ్ చిత్ర పరిశ్రమకు నా చిన్న పాటి విన్నపం. మన పరిశ్రమలో మన నటులే నటించాలనే ధోరణి నుంచి మీరు బయటకు రావాలని కోరుకుంటున్నా.
ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుంది. అలాగే తమిళ్ చిత్ర పరిశ్రమలో కూడా అందరి నటీ, నటులను తీసుకోవాలి. అంతే కానీ,.. తమిళ్ పరిశ్రమలో అక్కడి వాళ్లకే అవకాశాలు అంటే పరిశ్రమ ఎదగదు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందంటే దానికి కారణం.. అన్ని బాషల వారికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నాం. అన్ని భాషలు, కలయికలు ఉంటూనే కలయిక అవుతుంది తప్పా.. కేవలం మన భాష, మన వాళ్లే ఉండాలంటే కుంచించుకుపోతాం. అందుకే తమిళ్ ఇండస్ట్రీ పెద్దలకు నా విన్నపం ఇదే.. అక్కడి పరిశ్రమలో మీ వాళ్లను మాత్రమే తీసుకుంటున్నారనే భావనతో ఉన్నట్లు మా వరకు వచ్చింది. దయచేసి అలాంటి భావనను తీసేయాలని కోరుకుంటున్నా అంటూ పవన్ కల్యాణ్ హిత బోధ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త దుమారాన్నే రేపుతున్నాయి.
అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు విలక్షణ నటుడు నాజర్. ఆయన మాట్లాడుతూ.. తమిళ్ ఇండస్ట్రీపై కొందరు చేసిన ఆ వ్యాఖ్యలు అవాస్తవం. తమిళ్ ఇండస్ట్రీ మిగతా పరిశ్రమల నుంచి వచ్చిన అనేక మంది నటీ, నటులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఇండస్ట్రీ చాలా గొప్పది. తమిళ్ నటులను మాత్రమే కాకుండా మిగతా భాషల నటీ, నటులను తీసుకోవడంలో తమిళ్ చిత్ర పరిశ్రమ ఎప్పుడు ముందుంటుంది. కొత్త వారిని తీసుకోవడంతో పాటు ఎంతో ప్రోత్సాహం కూడా అందిస్తుంది. ఇతర భాషల నటులను తీసుకోవద్దనే రూల్ అక్కడేం పెట్టలేదు. ఇక ఆనాటి నటులైన సావిత్రి, ఎస్వీ రంగారావు వంటి ఎందరో నటీ, నటులు తమిళ్ భాషల్లో నటించారు. ఈ విషయం మీకు తెలియదా? ఇక నుంచి ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. తమిళ్ ఇండస్ట్రీపై ఇలా దుష్ప్రచారం చేస్తే బాగుండదంటూ నటుడు నాజర్ ఫైర్ అయ్యారు. తాజాగా నాజర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
ఇది కూడా చదవండి: భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ ఊర మాస్ పర్ఫార్మెన్స్!