కొన్నేళ్ల కింద తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు స్టార్ హీరో రవితేజ, నవదీప్ సహా పలువుర్ని పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన విషయం విదితమే. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా డ్రగ్స్ కేసులో మాదాపుర్ పోలీసులు ఒక డైరెక్టర్‌ను, రచయితను అరెస్ట్ చేశారు. దర్శకుడు మంతెన వాసు వర్మ, రైటర్ మన్నేరి పృథ్వీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి 70 గ్రాముల కొకైన్‌తో పాటు పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
డ్రగ్స్ కేసులో రాయదుర్గం పోలీసులు ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరిని జూన్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన నెలలోనే మరో డ్రగ్స్ కేసులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బిజినెస్‌మన్ కూడా అయిన వాసు వర్మ, పృథ్వీకృష్ణ నిందితులని తెలిసింది. సీనియర్ నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్ హీరోగా నటించిన ‘బస్తీ’ చిత్రాన్ని వాసు వర్మ డైరెక్ట్ చేశారు. అయితే వాసు పరారీలో ఉండటం, ఆయన దర్శకుడనే విషయం పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో ఈ కేసు ఫోకస్ కాలేదని తెలిసింది. వాసు వర్మతో పాటు పృథ్వీకృష్ణను మాదాపూర్ పోలీసులు 20 రోజుల కిందే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారట.
వాసు వర్మ, పృథ్వీకృష్ణలు ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ రాహుల్ అశోక్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిందని సమాచారం. కాగా, ఇటీవల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసుల్లో పలువురు ప్రొడ్యూసర్స్, యంగ్ డైరెక్టర్స్ అరెస్ట్ అవడం కలకలం రేపుతోంది. ఈ కేసుల్లో 50 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. హీరో నవదీప్‌ను కూడా విచారిస్తున్నారు. నార్కోటిక్ పోలీసుల ముందు శనివారం విచారణకు హాజరయ్యారు నవదీప్. ఆయన్ను సుమారు 6 గంటల పాటు విచారించారు పోలీసులు. ఈ కేసులో ఇంకెన్ని సంచనల విషయాలు బయటికొస్తాయో చూడాలి.
ఇదీ చదవండి: ఇండస్ట్రీని ఏలిన ఆ దర్శకుడు ఇకలేరు!