iDreamPost
iDreamPost
గత వారం రోజులుగా సినిమా క్యాన్సిల్ అయ్యిందని వచ్చిన వార్తలను ఫోటో సాక్ష్యంతో హీరో సూర్య కుండబద్దలు కొట్టేశాడు. దర్శకుడు బాలాతో చేయబోతున్న చిత్రం తాలూకు షూటింగ్ పిక్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి వాటికి చెక్ పెట్టాడు. ఇద్దరికీ అభిప్రాయభేదాలు వచ్చాయని, స్క్రిప్ట్ సూర్య జ్యోతికలకు నచ్చలేదని ఇలా ఏవేవో స్టోరీలు చెన్నై మీడియాలో రావడంతో ఆ వార్త ఇక్కడి దాకా వచ్చింది. అంత విశ్వసనీయంగా వచ్చినప్పుడు నిజమే అనుకున్న ఇక్కడి మీడియా ఛానల్స్ వాటినే తీసుకున్నాయి. దీంతో ఇది కాస్తా సౌత్ మొత్తం మారుమ్రోగిపోయింది. డ్యామేజ్ గుర్తించిన సూర్య వెంటనే రంగంలోకి దిగి స్పాట్ లో ఉన్న పిక్ ఇవ్వడంతో సెట్ అయ్యింది.
తన స్వంత బ్యానర్ మీద సూర్య జ్యోతికలే దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గెటప్ అదీ చూస్తుంటే శివపుత్రుడు లాంటి ఫ్లేవరే కనిపిస్తోంది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఆ సినిమాను మించేలా ఇది ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. పితామగన్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ టైంలో వంద రోజులు ఆడిన సెంటర్లు ఉన్నాయి. విక్రమ్ సూర్యల నటన, ఇళయరాజా సంగీతం క్లాస్ ను కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాతే బాలా తన స్థాయి మేజిక్ చేయలేకపోతున్నారు. పరదేశి, వాడు వీడు నేను దేవుణ్ణి టేకింగ్ పరంగా మెప్పులు పొందాయి కానీ కమర్షియల్ గా చెప్పుకుంటే మాత్రం ఫెయిల్యూర్స్ గానే నిలుస్తాయి.
కొంత కాలంగా సూర్య మార్కెట్ టాలీవుడ్ లో బాగా డౌన్ అయ్యింది. తను చేస్తున్న రొటీన్ సబ్జెక్ట్స్ మనవాళ్ళకు నచ్చడం లేదు. ఆ మధ్య వచ్చిన ఈటి(ఎవరికీ తలవంచడు) అరవంలో ఆడింది కానీ తెలుగులో మాత్రం డిజాస్టరే. దీనికి ముందు ఎన్జికె లాంటి ఫ్లాపులు మార్కెట్ ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. మరి బాలా లాంటి టిపికల్ దర్శకుడు ఇప్పుడు సూర్యని ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయినా ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం ఈ స్థాయిలో జరగడానికి కారణం ఎవరనేది మాత్రం బయటికి రాలేదు. నిప్పు లేనిదే పొగరాదు తరహాలో సూర్య లాంటి స్టార్ కి ఈ ప్రచారం జరగడం విచిత్రమే