iDreamPost
iDreamPost
అదేంటో ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను తప్పుబడుతున్న సాంకేతిక నిపుణులు పెరిగిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం 1 నేనొక్కడినే ఫ్లాప్ అయినప్పుడు తన మేథాశక్తిని అర్థం చేసుకునేంత స్థాయికి ఆడియన్స్ రాలేదని దర్శకుడు సుకుమార్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద విమర్శలు వచ్చి పడ్డాయి. అయితే తన మాటలను అపార్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చుకున్నారు కానీ అది వేరే విషయం. ఇప్పుడు అనంత శ్రీరామ్ వంతు వచ్చింది. సర్కారు వారి పాట ప్రమోషన్ లో భాగంగా ముందు టెక్నీషియన్లను రంగంలోకి దింపి ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్న మైత్రి సంస్థ అందులో భాగంగానే ఇతనితో కూడా ముఖాముఖీ చేయించింది.
ఈ సందర్భంగా కళావతి పాట ప్రస్తావన వచ్చింది. అందులో గాయకుడు సిద్ శ్రీరామ్ పదాలను పలికిన తీరు పట్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా కామెంట్స్ వచ్చి పడ్డాయి. దాని గురించి ప్రస్తావిస్తూ శ్రోతలు మారుతున్న టెక్నాలజికు అనుగుణంగా తమ ఆలోచనలు మార్చుకోవాలని, సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడాడని, రికార్డింగ్ జరుగుతున్నప్పుడు రకరకాల కారణాల వల్ల ఫైనల్ గా వింటున్న సమయానికి కొంత మార్పు ఉండొచ్చని ఏదేదో సమర్ధింపు ప్రయత్నం చేశాడు. అంటే సింగర్స్ మారరు కానీ వినేవాళ్ళలోనే అది రావాలన్నట్టుగా అనంత్ శ్రీరామ్ ప్రవచించిన తీరు నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.
అయినా సాంకేతికత పెరిగితే క్వాలిటీ పెరగాలి కానీ ఇలా జనాలను కాంప్రోమైజ్ కమ్మని చెప్పడం ఎందుకు. ఇదేమి లేని రోజుల్లో ఘంటసాల, ఎస్పి బాలసుబ్రమణ్యం, మనో లాంటి వాళ్ళు అద్భుతాలు ఎలా చేయగలిగారు. పోనీ సిద్ శ్రీరామ్ ఇతర భాషకు సంబందించిన వాడు కాదని అంటారా. మరి తెలుగు మాతృబాష కాని జేసుదాస్, శంకర్ మహదేవన్, ఉన్ని కృష్ణన్, శ్రేయ ఘోషల్ లాంటి ఎందరో స్పష్టమైన ఉచ్చారణతో ఎక్కడా తప్పులు దొర్లకుండా పాడారు పాడుతున్నారు. భూతద్దం పెట్టి వెతికినా దోషాలు దొరకవు. అలాంటప్పుడు వినేవాళ్ళు మారండి తప్ప గాయకుడు అలాగే పాడతారని గీత రచయిత చెప్పడం మాత్రం విచిత్రమే.