భారత్‌-కెనడా మధ్య గొడవేంటి? అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

భారత్-కెనడాల మధ్య సత్సంబంధాలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదానికి ఆజ్యం పోసిన అంశం ఖలీస్థాని వేర్పాటు వాద నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య. జూన్ 18న కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రేవద్ద హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తక్షణమే భారత దౌత్య వేత్తను కెనడా నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొనడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో తమ దేశం వదిలి వెళ్లాలని కెనడా దేశ రాయబార్లకు ఇండియా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా హెచ్చరించింది. ఇంతటి విపరీత పరిణామాలకు దారి తీసిన పరిణామాలు ఏంటంటే..? ఎక్కడ ఈ గొడవ మొదలైందీ అంటే..?

ఇంతకు ఎవరీ ఖలీస్థానీయులు

భారతదేశంలో పంజాబ్ ఓ రాష్ట్రం. ఇక్కడ సిక్కులు ఎక్కువగా నివసిస్తుంటారు. అయితే భారత్ నుండి పంజాబ్‌ను వేరు చేసి.. తమకు ప్రత్యేక దేశం కావాలంటూ పోరాడుతున్న వారే ఈ  ఖలీస్థానీయులు. వీరే వేర్పాటు వాదులుగా, ఖలీస్తానీ ఉగ్రవాదులుగా ముద్రపడ్డారు. అయితే ఈ ఖలీస్తానీయులపై వేటు వేసింది భారత్. అందులోని వ్యక్తే ఈ నిజ్జర్. పంజాబ్ లోని జలంధర్ సమీపంలోని భార్ సింగపుర వాసి అయిన అతడు.. కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. అక్కడ ఖలీస్తాని వేర్పాటు వాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)ను ఏర్పాటు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో, ఇదొక ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ భారత్ దీన్ని నిషేధించింది. భారత్‌లో పలు బాంబు దాడులు, కెనడా, యుకే, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉందని పేర్కొంటూ 2020లో అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది భారత్.

కెనడా-భారత్ బంధానికి బీటలు

సిక్కులు ఎక్కువ నివసించే దేశాల్లో కెనడా కూడా ఒకటి. కెనడా వీరిని ఓ ప్రత్యేకమైన ఓటు బ్యాంకుగా చూస్తూ ఉంటుంది. అయితే 2021 కెనడా ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ.. బలం చాలకపోవడంతో జగ్మీత్ సింగ్ ధలీవాల్-జిమ్మీ నేతృత్వంలోని ఎన్ డీపీ మద్దతును తీసుకోవాల్సి వచ్చింది. ఈ పార్టీకి చెందిన నేతలు ఖలీస్తాన్ ఎజెండాకు మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో ఖలీస్తానీయులను ఉగ్రవాదులుగా చూస్తున్న భారత్ ప్రభుత్వానికి ట్రూడో మద్దతు తీసుకోవడం మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఖలీస్తానీల పట్ల ఏకపక్ష ధోరణితో ట్రూడో వ్యవహరిస్తున్నాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు. అప్పటి నుండి కెనడా-భారత్ బంధానికి బీటలు వారడం మొదలు పెట్టాయి. ఇది వాణిజ్య  ఒప్పందాలు, భారతీయుల విద్య, ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని సమాచారం.

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు

జూన్ 18న కేటిఎఫ్ ఏర్పాటు నేత నిజ్జర్ హత్యకు గురికావడంతో భారత్-కెనడా మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ, ట్రూడో మధ్య ఖలీస్తాని అంశం చర్చకు వచ్చింది. అయితే ఖలీస్తానీ అంశంపై ట్రూడో మాట్లాడుతూ.. తాము ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు, శాంతియుత నిరసనలకు పెద్ద పీట వేస్తామని, ఏ ఒక్కరి చేస్తున్న చర్యను  మొత్తం కెనడా సమాజానికి ముడిపెట్టవద్దని చెప్పుకొచ్చారు. భారత్ నుండి వెళ్లిన కొద్దీ రోజుల్లోనే నిజ్జర్ హత్యకు భారత్ కు సంబంధాలున్నాయంటూ కీలక ప్రకటనలు చేయడం.. ఇక్కడి దౌత్య వేత్తను బహిష్కరించడం, దీన్ని ఖండించిన భారత్.. కెనడా దౌత్య వేత్తలను దేశం విడిచి వెళ్లిపోమనడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితుల దృష్ట్యా కెనడాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలోని భారత పౌరులు, విద్యార్థులు, అక్కడకు ప్రయాణించాలనుకునే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరి భారత్‌-కెనడా మధ్య విభేదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments