Dharani
బ్లడ్ స్కాండల్.. రక్త కుంభకోణం ఈ పేరు యూకేని వణికిస్తోంది. దీని వల్ల 30 వేల మందికి ఎయిడ్స్ వచ్చింది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్లడ్ స్కాండల్.. రక్త కుంభకోణం ఈ పేరు యూకేని వణికిస్తోంది. దీని వల్ల 30 వేల మందికి ఎయిడ్స్ వచ్చింది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dharani
రక్తం మనిషికి ప్రాణదానం చేస్తుంది. అందుకే సెలబ్రిటీలు మొదలు.. సామాజిక, సేవా, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన ప్రాముఖ్యతను వివరిస్తుంటాయి. అయితే రక్తదానం మనిషికి ప్రాణాలు పోయడం ఎంత నిజమో.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది అన్నది కూడా అంతే వాస్తవం. ప్రతి ఏటా కలుషిత రక్తం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు, మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ చరిత్రలోనే అత్యధిక మందిని బలితీసుకున్న బ్లడ్ స్కాండల్.. రక్త కుంభకోణం 40 ఏళ్ల క్రితం యూకేలో వెలుగు చూసింది.
తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్.. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి నివేదికను వెల్లడించడమే కాక.. బాధితుల కుటుంబాలకు క్షమాపణలు తెలియాజేశారు దాంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఈ ఉదంతం చర్చనీయాంశం అవుతోంది. అసలేంటి బ్లడ్ స్కాండల్.. ఇది ఎలా జరిగింది.. ఎందరు చనిపోయారు.. ఈ దారుణంలో బాధితులెందరూ వంటి పూర్తి వివరాలు మీకోసం..
సుమారు 40 ఏళ్ల క్రితం లండన్‌లో ఈ రక్త కుంభకోణం వెలుగు చూసింది. ఈ కలుషిత రక్తం కారణంగా వేల మంది హెచ్‌ఐవీ, హెపటైటిస్ బాధితులుగా మారారు. ఇన్నాళ్ల తర్వాత ఈ ఘటనకు సంబంధించిన తుది నివేదక వచ్చింది. యూకే చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా చరిత్రలో నిలిచిన ఈ ఉదంతంపై రిషి సునాక్ ప్రభుత్వం సోమవారం పూర్తి వివరాలు బయటపెట్టింది. నివేదికలో తెలిపిన దాని ప్రకారం.. ఈ కలుషిత రక్తం కారణంగా 30 వేల మంది హెచ్‌ఐవీ, హెపటైటస్ బారిన పడగా.. సుమారు 3 వేల మంది వరకు మృత్యువాత పడ్డారు.
1970 దశకంలో బ్రిటన్ ప్రభుత్వం.. హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల కోసం ప్లాస్మా చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఫ్యాక్టర్ VIII పేరుతో ల్యాబ్‌లో తయారైన కృత్రిమ రక్తాన్ని వినియోగించారు. దీన్ని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్.. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. చికిత్సలో భాగంగా వేలాది మంది బాధితులకు ఈ రక్తాన్ని వినియోగించారు. అయితే 1970-90ల మధ్య ప్లాస్మా చికిత్స తీసుకున్న చాలా మందిలో.. సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం మొదలైంది. ముందుగా లివర్ ఇనఫెక్షన్‌కు గురై.. అది కాస్త క్రమంగా హెచ్ఐవీ, హెపటైటిస్-సీ వంటి ప్రాణాంత వ్యాధులకు దారి తీసినట్టు నిర్థారించారు.
ఈ బాధితుల సంఖ్య 30 వేలకు పైగా ఉండగా.. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇక ఇలా ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిలో సుమారు 3 వేల మంది చనిపోయినట్లు.. నివేదికల్లో వెల్లడయ్యింది. ఇక కొన్ని సందర్భాల్లో హీమోఫీలియాతో బాధపడుతున్న పిల్లలను పరిశోధన వస్తువులుగా భావించారని.. తర్వాత కాలంలో వీరిలో చాలా మందికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ సోకి చనిపోయారని నివేదిక స్పష్టం చేసింది. ఇక ఈ చికిత్స కోసం.. ఖైదీలు, డ్రగ్స్ బానిసల వంటి ప్రమాదకర దాతల నుంచి స్వీకరించిన రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాను వినియోగించినట్లు తెలిసింది.
ఇలా స్వీకరించిన కలుషిత రక్తాన్ని.. ప్రసవం, సర్జరీలు, ప్రమాదాల బారినపడిన రోగుల చికిత్సలో వినియోగించారని.. ఫలితంగా వేల మంది ఎయిడ్స్, హెపటైటిస్ బారిన పడినట్లు తేలింది. ఆ తర్వాత కాలంలో ఈ దారుణం వెలుగు చూడటంతో.. యూకే ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు ఓ కమిటీని నియమించింది. ఇక తాజాగా న్యాయమూర్తి బ్రియాన్ లాంగ్‌స్టాప్ నేతృత్వంలోని కమిటీ.. 2500 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇది పూర్తి స్థాయి నివేదిక కాదని.. లాంగ్‌స్టాఫ్ తెలిపారు. ఇక 1980 ప్రాంతంలో రక్తం ద్వారా ఎయిడ్స్ సంక్రమించవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయినా సరే.. ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు ఈ కలుషిత రక్తం కుంభకోణాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎయిడ్స్ వ్యాప్తి ప్రమాదాలను నివారించడంలో వారు విఫలం అయ్యారు.
ఇక తాజాగా అందిన నివేదికపై రిషి సునాక్ మాట్లాడుతూ.. ‘‘బ్లడ్ స్కాండల్‌లో వేలాది మంది బాధితులుగా మారిన దశాబ్దాల నాటి ఈ ఘటనను ఇన్నాళ్లు దాచి పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఈ భయంకరమైన అన్యాయానికి నేను మనస్ఫూర్తిగా, నిర్ద్వంద్వంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. బాధిత కుటుంబాలకు ఎంత నష్టపరిహారం అయిన చెల్లించేందుకు మేం సిద్ధం’’ అన్నారు.