Dharani
Dharani
శాస్త్ర సాంకేతికత ఎంత పెరిగినా.. వైద్య రంగంలో ఎంత అభివృద్ధి సాధించినా.. కొన్ని వ్యాధులను పూర్తిగా అరకట్టలేకపోతున్నాం. ఇక రోజుకో కొత్త రకం వైరస్‌లు మన మీద దాడి చేస్తూ.. మన టెక్నాలజీని సవాల్ చేస్తుంటాయి. ఇక కొన్ని వ్యాధులకు ఇప్పటికి సరైన చికిత్స లేదు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి జబ్బులకు నేటికి కూడా సరైన చికిత్స లేదు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ చికిత్సలో పురోగతి కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు నిత్యం ప్రయోగాలు చేస్తూ ఉంటూ.. అధునాతన చికత్స విధానాలను తెర మీదకు తీసుకు వస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సంబంధించి శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఏడు నిమిషాల్లోనే క్యాన్సర్ చికిత్స పూర్తయ్యే పద్దతిని అభివృద్ధి చేశారు. వైద్య చరిత్రలోనే ఇది సంచలనం అంటున్నారు. ఆ వివరాలు..
ఏడు నిమిషాల్లోనే క్యాన్సర్ చికిత్స పూర్తయ్యే పద్దతిని తాజాగా బ్రిటన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. క్యాన్సర్ రోగికి ఇచ్చే ఇంజెక్షన్ సమయాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఆఫ్ బ్రిటన్ ఆమోదం తెలిపింది. దీని వల్ల క్యాన్సర్ చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. ఇలా సమయం తగ్గడం వల్ల.. వైద్యులు ఎక్కువ మంది రోగులకు చికిత్స చేసే అవకాశం లభిస్తుంది అంటున్నారు.
ప్రపంచంలోనే మొదటిసారిగా ఇంగ్లాండ్ ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది చికిత్సా సమయాన్ని మూడొంతులు తగ్గిస్తుందని తెలిపారు. క్యాన్సర్ బాధితులకు ఇమ్యునోథెరపీలో భాగంగా అటెజోలిజుమాబ్ (అటెజోలిజుమాబ్) ఇంజెక్షన్‌ను డ్రిప్ ద్వారా చర్మం కింద నుంచి ఇస్తారు. ఇందుకు 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. అయితే తాజాగా ఆమోదించిన చికిత్స విధానంలో కేవలం 7 నిమిషాల్లోనే ఈ ఇంజక్షన్‌ని ఇవ్వొచ్చు. క్యాన్సర్ రోగులకు, వైద్యులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది అని తెలిపారు.
యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ తాజాగా ఈ చికిత్సకు ఆమోదం తెలిపి.. ఆగస్టు 29న సుమారు 100 మంది కేన్సర్ రోగులకు ప్రయోగాత్మకంగా అందజేశారు. ఊపిరితిత్తులు, రొమ్ము, కాలేయ, మూత్రాశయ క్యాన్సర్ రోగులకు ఈ చికిత్స అందజేయనున్నట్టు ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది. ఈ ఔషధం రోగులకు అనుకూలంగా ఉండటమే కాదు.. ఎక్కువ మంది బాధితులకు చికిత్స చేయడానికి మా వైద్య బృందాలకు సహకరిస్తుందని ఎంహెచ్‌ఆర్ఏ పేర్కొంది.
ఈ సందర్భంగా అటెజోలిజుమాబ్ ఔషధ సంస్థ రోచే ప్రోడక్ట్స్ మెడికల్ డైరెక్టర్ మారియస్ స్కోల్ట్జ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ఇంట్రావీనస్ ఇన్ఫ్యూషన్ పద్ధతికి పట్టే 30 నుంచి 60 నిమిషాలతో పోల్చితే ఇది సుమారు ఏడు నిమిషాల్లోనే పూర్తవుతుంది’’ అన్నారు. ఇమ్యునోథెరపీలో భాగంగా క్యాన్సర్ రోగులకు అటెజోలిజుమాబ్ అనే ఔషధం ఇస్తారు. ఇది క్యాన్సర్ కణాలను వెతికి, నాశనం చేయడంతో పాటు బాధితుల రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది అని తెలిపారు. అంతేకాక అటెజోలిజుమాబ్‌తో కలిపి ఇంట్రావీనస్ కెమోథెరపీ చేసుకునే రోగులు రక్తమార్పిడి చేయించుకునే వీలుందని పేర్కొంది