iDreamPost
android-app
ios-app

రైతులుగా మారిన సైన్యం.. 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు

  • Published Sep 27, 2023 | 2:08 PM Updated Updated Sep 27, 2023 | 2:08 PM
  • Published Sep 27, 2023 | 2:08 PMUpdated Sep 27, 2023 | 2:08 PM
రైతులుగా మారిన సైన్యం.. 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు

సాధారణంగా సైనికులు అంటే.. చేతిలో ఆయుధం ధరించి.. ఎండనకా.. వాననకా.. గడ్డకట్టే చలిలో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ.. దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడతారు. తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి.. శత్రువులతో తలపడతారు. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన సీన్‌ కనిపించింది. చేతిలో ఆయుధం పట్టి.. దేశ రక్షణ కోసం నిలబడే సైనికులు.. తాజాగా చేతిలో హలం పట్టి.. పొలం పనులు చేస్తోన్న దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది. రైతులుగా మారిన సైన్యం.. ఏకంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరి ఇంతకు ఎక్కడ అంటే..

ఈ రివర్స్‌ సన్నివేశం.. పాకిస్తాన్‌లో కనిపించింది. దాయాది దేశ ఆర్మీ.. ఏకంగా అక్కడి పాలనను శాసిస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. నచ్చిన వారిని గద్దెనెక్కించడం.. నచ్చకపోతే.. దింపేయడం.. ఇదంతా సైన్యం చేతిలోనే ఉంటుంది. పాకిస్తాన్‌లో ఆర్మీనే అల్టిమేట్‌.. పాలకులు కేవలం కీలు బొమ్మలు మాత్రమే అని చెప్పవచ్చు. వాస్తవానికి పాక్ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చినా.. దానిలో సైన్యం పాత్ర కీలకంగా ఉంటుంది. దేశాన్ని తమ కనుసన్నల్లో నడిపించే పాకిస్తాన్‌ సైన్యం.. ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి దివాలా తీసిన దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు నడుం బిగించింది.  ఇందుకు కోసం ఆయుధం వీడి.. హలం పట్టి వ్యవసాయం క్షేత్రంలోకి దిగింది.

నిక్కీ ఆసియా నివేదిక వివరాల ప్రకారం.. పంజాబ్‌ ప్రావిన్సుల్లోని దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పాక్ సైన్యం కౌలుకు తీసుకుని సాగు చేయనుంది. ఇలా లీజుకు తీసుకున్న భూమిలో సైన్యం.. గోధుమలు, పత్తి, చెరకు, కూరగాయలు, పండ్లు వంటి పంటలను పండించనుంది. ఇలా సాగు చేసిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం సొమ్మును వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయించాలని పాక్‌ సైన్యం నిర్ణయించింది. మిగిలిన సొమ్మును సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి. పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పాక్‌ సైన్యం చెప్పుకొచ్చింది.

అయితే దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. సైన్యం చర్యలతో.. గ్రామీణ పేదల భూమి మీద హక్కులు కొల్పోయే ప్రమాదం ఉందనే వాదన కూడా వినిపిస్తుంది. గోధుమలు, పత్తి, చెరకు వంటి పంటలు, అలాగే కూరగాయలు, పండ్లు పండించడానికి సైన్యానికి 30 ఏళ్ల వరకు భూమిని లీజుకు ఇచ్చినట్టు పత్రాలు చూపుతున్నాయి. కానీ, దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదల హక్కులు ఉల్లంఘనకు గురవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శక్తివంతమైన సంస్థగా ఉన్న సైన్యం ఆహార-భద్రత పేరుతో భారీ లాభాలను ఆర్జిస్తుందని అంటున్నారు నిపుణులు. పైగా ఈ చర్యల వల్ల పాకిస్తాన్‌ సైన్యం దేశంలో ఏకైక అతిపెద్ద భూ యజమానిగా అవతరిస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి.