దేశం కోసం, ప్రేమ కోసం.. పెళ్లి చేసుకుని యుద్ధ క్షేత్రంలోకి నవ దంపతులు

హమాస్ మిలిటెంట్లు ఆకస్మికంగా జరిపిన దాడులకు ఇజ్రాయెల్ అతలాకుతలం అయ్యింది. వేలాది రాకెట్ల తో విరుచుకు పడిన మిలిటెంట్లు ఇజ్రాయెల్ లో నరమేధాన్ని సృష్టించారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు వందల కొద్ది మృత్యువాత పడ్డారు. వేలమంది తీవ్ర గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా మిలిటెంట్ల దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రేమికులైన ఓ జంట పెళ్లి చేసుకుని యుద్ధ క్షేత్రంలోకి దిగారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం రిజర్వ్ సైనికులను సైన్యంలో చేరాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆ నవ దంపతులు యుద్ధంలో చేరారు.

ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లపై భీకర యుద్ధాన్ని కొనసాగిస్తోంది. మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేసి మట్టుబెడుతోంది. కాగా ఈ అత్యవసర యుద్ధ సమయంలో దేశంలో ఉన్న 3లక్షల మంది రిజర్వ్ సైన్యాన్ని సైన్యంలో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ తన భార్యాబిడ్డలను వదిలి ఇజ్రాయెల్ సైన్యంలో చేరిన విషయం తెలిసిందే. కాగా రిజర్వ్ ఫోర్స్ లో ఉన్న ఓ యువ ప్రేమికులు కూడా తమ ప్రేమ కోసం, దేశం కోసం పెళ్లి చేసుకుని యుద్ధంలో చేరారు.

ఉరి మింట్జెర్, ఎలినోర్ యోసెఫిన్ అనే ఇద్దరు ప్రేమికులు రిజర్వ్ ఫోర్స్ లో ఉన్నారు. అయితే వారు యుద్ధానికి వెళ్లేముందు హడావుడిగా పెళ్లి చేసుకున్నారు. తామిద్దరం చాలా మంచి స్నేహితులం అని, ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నట్లు చెప్పారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆ యువ జంట తెలిపారు. తాము త్వరలోనే యుద్ధాన్ని ముగించుకుని ఇంటికి వచ్చి ఘనంగా పెళ్లి వేడుక జరుపుకుంటామని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Show comments