iDreamPost
android-app
ios-app

రెండేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు..!

  • Published Oct 18, 2024 | 12:04 PM Updated Updated Oct 18, 2024 | 12:04 PM

Young man who married Transgender: ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి తన రెండేళ్ల ప్రేమను గెలిపించుకున్నాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

Young man who married Transgender: ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి తన రెండేళ్ల ప్రేమను గెలిపించుకున్నాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

రెండేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు..!

ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తుల కోసం ఎల్లలు దాటి వస్తున్నారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడేందుకు దేశం విడిచి వెళ్తున్నవారు ఉన్నారు విదేశాల నుంచి వస్తున్నవారు కూడా ఉన్నారు. ప్రేమ అనేది ఓ మధురమైన అనుభూతి. ప్రేమకు కులమతాలతో పట్టింపు లేదు. భాషతో సంబంధం లేదు. ప్రేమనేది రెండు మనసుల కలయిక. ప్రేమ కోసం ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఇరు కుటుంబాలను ఒప్పించి తమ ప్రేమను గెలిపించుకుని వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. తల్లిదండ్రుల కూడా పిల్లల ప్రేమను అంగీకరిస్తున్నారు. యువతీ యువకుల మధ్య ప్రేమ సర్వసాధారణమే.

అయితే ఇప్పుడు ప్రేమకు లింగభేదం అడ్డురాదంటూ కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అమ్మాయిలు అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకున్న ఘటనలు చూశాం.. తాజాగా ఓ యువకుడు ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ట్రాన్స్ జెండర్లను యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సరికొత్త ట్రెండ్ గా మారింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ మల్యాల.. అదే మండలానికి చెందిన మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ కరుణాంజలితో రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇద్దరి మనసులు కలిశాయి. కలిసి జీవించాలని అనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిపోయాడు. తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చాడు శ్రీనివాస్. ఇక తమ కుమారునికి వివాహం చేయాలని ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. తన ప్రేమ విషయాన్ని ఇక ఆలస్యం చేయకూడదని భావించిన శ్రీనివాస్ పెద్దలకు చెప్పాడు. తాను ప్రేమిస్తున్నది ఓ అమ్మాయిని కాదు.. ట్రాన్స్ జెండర్‌ను అని చెప్పగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ పెళ్లికి మేము ఒప్పుకోమని చెప్పారు. అయితే ప్రేమకు లింగభేదం అడ్డుకాదని శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఒప్పించాడు. దీంతో.. చేసేదేమిలేక కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు.

ఇంకేముంది.. బంధుమిత్రులు సమక్షంలో శ్రీనివాస్, కరుణాంజలి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సాధారణ పెళ్లి మాదిరిగానే వీరి పెళ్లి ఘనంగా జరిగింది. శ్రీనివాస్, కరుణాంజలి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెద్దలను ఒప్పించి వారి ప్రేమను గెలిపించుకున్నారు. ఈ జంటను దీవించేందుకు.. శ్రీనివాస్ తరపు బంధువులు రాగా.. కరుణాంజలి తరపున ట్రాన్స్ జెండర్లు హాజరయ్యారు. సమాజంలో చీదరింపుకు, చిన్న చూపుకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ ని ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ ను పలువురు అభినందిస్తున్నారు. మరి యువకుడు ట్రాన్స్ జెండర్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.