iDreamPost
android-app
ios-app

100 మందిని బలితీసుకున్న అ‍గ్ని ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న నూతన దంపతులు!

  • Author singhj Updated - 01:40 PM, Tue - 3 October 23
  • Author singhj Updated - 01:40 PM, Tue - 3 October 23
100 మందిని బలితీసుకున్న అ‍గ్ని ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న నూతన దంపతులు!

ప్రకృతి విపత్తులు ఎవరికీ చెప్పి రావు. వీటి వల్ల తీవ్ర స్థాయిలో ధన, ప్రాణ నష్టం సంభవిస్తుంది. ప్రకృతి విపత్తుల్లాగే ప్రమాదాలు కూడా ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం. అయితే వీటి వల్ల జరిగే నష్టాన్ని పూడ్చడం మాత్రం అంత ఈజీ కాదు. ఇటీవల ఇరాక్​లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ జరుగుతున్న ఒక ఫంక్షన్ హాల్​లో ఈ ప్రమాదం జరిగింది. వేడుక జరుగుతున్న టైమ్​లోనే మంటలు చెలరేగడంతో 107 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్నారు. ఈ ఘోర విషాదంలో పెళ్లి జంట కూడా చనిపోయారని వార్తలు వచ్చాయి. నార్త్ ఇరాక్​లోని నెనెవెహ్ ప్రావిన్స్​, అల్​హమ్దానియా జిల్లాలో గత మంగళవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.

ఇరాక్​లో జరిగిన ఈ వివాహ వేడుకలో దాదాపు 1000 మంది పాల్గొన్నారని తెలుస్తోంది. అయితే మంగళవారం రాత్రి 10.45 గంటల టైమ్​లో ఫంక్షన్ హాల్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించడంతో 107 మంది చనిపోగా.. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లందర్నీ దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అప్పటివరకు పెళ్లి వేడుకతో సందడి సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటనతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. వివాహ వేడుకలో బాణసంచా కాల్చడమే అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా టపాసులు పేల్చడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

ఈ ఘటనలో కొత్త పెళ్లి జంట మరణించారని అంతా భావించారు. కానీ అదృష్టం కొద్దీ వాళ్లు బయటపడ్డారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి. అందులో వాళ్లు మాట్లాడుతూ కనిపించారు. ‘మేం డ్యాన్స్ చేస్తున్న టైమ్​లో ఫంక్షన్ హాల్ పైనుంచి భారీ ఎత్తున అగ్నికీలలు కింద పడ్డాయి. దీంతో అందరూ ఒకేసారి భయంతో పరుగులు తీశారు. దీంతో తన (పెళ్లి కూతురి) రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఆమెను తీసుకొని నేను కిచెన్ వైపు వెళ్లాను. అసలు ఎందుకిలా జరిగింది? మేమేం తప్పు చేశాం? మేం ఇక్కడ బతకాలనుకోవడం లేదు. మేం సంతోషంగా ఉన్న ప్రతిసారి ఏదో ఒక విపత్తు వచ్చి దాన్ని నాశనం చేస్తోంది. అందుకే జీవించాలని లేదు. తల్లి, సోదరుడు సహా 10 మంది బంధువులను తను కోల్పోయింది. ఆమె మాట్లాడలేదు కూడా. మేం మీ ముందు సజీవంగా కనిపిస్తున్నాం. కానీ లోలోపల అప్పుడే చనిపోయాం’ అని పెళ్లి కొడుకు వాపోయాడు.

ఇదీ చదవండి: విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే TDPలో చీలిక!