ఫ్రెంచ్ డేర్ డెవిల్ రెమి లూసిడి మృతి.. 68వ అతస్తు నుంచి పడి..!

మనకు ముడు అడుగుల గోడ మీద నుంచి నడవాలి అంటేనే కళ్లు తిరగడం, కింద పడితే ఎక్కడ కాళ్లు విరుగుతాయో అనే భయం ఉంటుంది. కానీ, కొందరు మాత్రం 60, 70 అంతస్తుల మీద కూడా చాలా ధైర్యంగా నడుస్తారు. నడవడం మాత్రమే కాకుండా పరిగెడతారు కూడా. అలాంటి వారికి స్క్రై స్క్రాపర్స్ అనే పేరు కూడా ఉంది. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ డేంజరస్ ఫీట్స్ చేస్తుంటారు. అలాంటి వారిలో బాగా వినిపించే పేరు ఫ్రెంచ్ డేర్ డెవిల్ రెమి లూసిడి. అయితే అతను హాంకాంగ్ లో 68వ అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

పాములు పెంచే వాడు.. పాము కాటుకే బలి అవుతాడంటూ పెద్దలు చెబుతారు. రెమి లూసిడీ విషయంలో అది నిజంగానే నిజమైంది. ఎంత ఎత్తైన బిల్డింగ్ ని అయినా సునాయాసంగా ఎక్కేయగలడు. ఫ్రాన్స్ కు చెందిన రెమి లూసిడీ(30) ఫ్రెంచ్ డేర్ డెవిల్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కానీ, చివరికి బిల్డింగ్ మీద నుంచే కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. హాంకాంగ్ లో ఉన్న 68 అంతస్తుల భవనంపై వీడియో చేస్తుండగా రెమి లూసిడి కిందపడి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ భవనం పైన లూసిడి కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాంకాంగ్ లోని ఎత్తైన బిల్డింగుల్లో ఒకటైన ట్రెగంటెర్ టవర్ ని ఎక్కేందుకు లూసిడి ప్రయత్నించాడు.

ఆ భవనం ఎక్కేందుకు అతను అనుమతి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కిందపడే సమయంలో 68వ అంతస్తు పెంట్ హౌస్ కిటీకి బయట అతను చిక్కుకున్నట్లు చూసిన వాళ్లు చెబుతున్నారు. అతను భయంతో కిటికీని తన్నాడు. కాసేపటికే పట్టు తప్పి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు. రెమి లూసిడి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ట్రెగంటెర్ భవనం వద్దకు వచ్చాడు. అక్కడ 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నట్లు చెప్పాడు. అయితే 40వ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి లూసిడి ఎవరో తెలియదని చెప్పడంతో సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎలివేటర్ లో రెమి లూసిడి 48వ అంతస్తుకు చేరుకున్నాడు.

అక్కడి నుంచి మెట్ల మార్గంలో టవర్ పైకి చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. భవనం పైకి ఎక్కడం తామెవరూ చూడలేదని సిబ్బింది చెప్పారు. అయితే 68వ అంతస్తులో పనిచేస్తున్న మహిళ లూసిడిని చూసి పోలీసులకు సమాచారం అందించింది. కొద్దిసేపటికే లూసిడి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. భవనం పైన అతని కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఇలాంటి సాహసాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. రెమీ లూసిడి ఇక లేడనే విషయం తెలుసుకుని అతని ఫాలోవర్స్, ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. అతి చిన్న వయసులోనే రెమీ లూసిడి మరణించడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

Show comments