‘ఇండియా’ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలంటూ BJP MP డిమాండ్!

‘ఇండియా’ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలంటూ BJP MP డిమాండ్!

ప్రస్తుతం దేశంలో ఇండియా అనే పేరు బాగా చర్చల్లోకి రావడంచూస్తున్నాం. కాంగ్రెస్ నేతృత్వంలో ముందుకెళ్తున్న ప్రతిపక్షాలు.. తమ కూటమికి ఇండియా(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్ క్లూసివ్ అలైన్స్) అనే పేరు పెట్టుకోవడం చూశాం. అప్పటి నుంచి బీజేపీ వాళ్లు కూడా ఎదురుదాడి ప్రారంభించారు. 2024 ఎన్నికలు ఇండియా vs భారత్ గా మారబోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికి ఉన్నవి చాలక.. ఇండియా పేరు మీద మరో కొత్త అభ్యంతరం వైరల్ అవుతోంది. తాజాగా రాజ్యసభలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇండియా అనే పేరు చుట్టూ రాజకీయం, చర్చలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ నరేశ్ బన్సాల్ రాజ్యసభలో ఇండియా అనే పదాన్ని తొలగించాలంటూ కొత్త డిమాండ్ ను తీసుకొచ్చారు. ఈయన చేసిన వ్యాఖ్యలతో నెట్టింట కొత్త దుమారం కూడా రేగింది. మణిపూర్ సంఘటన గురించి చర్చించమంటే.. అది పక్కన పెట్టి ఇవా మీరు చేసే డిమాండ్లు అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు బీజేపీ ఎంపీ ఏమంటున్నారంటే.. “ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు తీసుకొచ్చిన పేరు. మొదటి నుంచి మన దేశాన్ని భారత్ అనే పిలుచుకుంటున్నాం. రాజ్యాంగంలో ఇప్పటికీ ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ అని ఉండటం బాధాకరం. ఇండియా అనే పదం ఇప్పటికీ మన బానిసత్వాన్ని సూచిస్తోంది. ఇప్పటికైనా వెంటనే రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా భరతమాతకు భాషా పరమైన సంకెళ్లను తొలగించి స్వేచ్ఛను కలిగించాలని కోరుతున్నాం” అంటూ చెప్పకొచ్చారు.

ప్రస్తుతం బీజేపీ ఎంపీ నరేస్ బన్సాలి కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే మీరు దేని కోసం డిమాండ్ చేస్తున్నారు? మీరు మాట్లాడేందుకు దేశంలో సమస్యలు ఏమీ లేవని భావిస్తున్నారా? అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ ఘటన గురించి ఎందుకు చర్చ జరగడం లేదు అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల కూటమి ఇండియా అనే పేరు పెట్టుకోవడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం చూస్తున్నాం. ప్రజలను ఎమోషనల్ గా తమవైపు తిప్పుకోవడానికే ఇలాంటి పేరు పెట్టారంటూ బీజేపీ నేతలు మాత్రమే కాకుండ కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Show comments