విశాఖలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 10,742 కోట్ల వ్యయంతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సభా ప్రాంగణం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజలతో ఏయూ మైదానం కిటకిటలాడింది.
అనంతరం మట్లాడిన సీఎం జగన్.. ఏయూలో జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం మోదీ సభకు తరలివచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా కవి, దివంగత వంగపండు ప్రసాద రావును సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘గాయకుడు వంగపండు మాటలు గుర్తుకు వస్తున్నయ్. ‘ఏం పిల్లడో.. ఎళ్దాం వస్తవా..’ అంటూ ఈరోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదలిరావటం ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ‘వస్తున్నాయ్ వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్..’ అన్నట్లుగా సభకు ప్రజలు హాజరయ్యారు.’ అని జగన్ వ్యాఖ్యనించారు.