దేవిశ్రీప్రసాద్ మొదలుపెట్టింది కాదు..

  • Published - 11:30 AM, Fri - 4 November 22
దేవిశ్రీప్రసాద్ మొదలుపెట్టింది కాదు..

సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ చూడని ఎత్తులు లేవు. చాలా చిన్న వయసులో ప్రైవేట్ ఆల్బమ్ తో కెరీర్ మొదలుపెట్టి దేవి రూపంలో భారీ సినిమాకు అతను అందించిన మ్యూజిక్ చాలా తక్కువ టైంలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది. మణిశర్మ, కీరవాణి, కోటి ప్రభంజనం తీవ్రంగా ఉన్న టైంలో దేవి దూసుకొచ్చిన తీరు మామూలుది కాదు. ఆర్య, వర్షం, శంకర్ దాదా ఎంబిబిఎస్, గబ్బర్ సింగ్, భద్ర, బొమ్మరిల్లు, జల్సా, 100 పర్సెంట్ లవ్, జులాయి ఇలా చెప్పుకుంటే ఆ ఆల్బమ్ పేర్లతోనే పేజీలు నిండిపోతాయి. ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టులో వీటికి అగ్ర స్థానం ఉంది. ఈ మధ్య తన స్థాయికి తగ్గ స్కోర్ ఇవ్వలేదనే కామెంట్స్ దేవి మీద బలంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ రాబోయే చిరంజీవి వాల్తేర్ వీరయ్య మీదే పెట్టుకున్నాడు. నాలుగు ఊర మాస్ పాటలను బాస్ కోసం ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఇదంతా బాగానే ఉంది కానీ ఆవకాశాలు తగ్గాయనో లేక తన సత్తా ఇంకోరూపంలో చూపాలనో దేవి ఇటీవలే ఒక నాన్ సినిమా ఆల్బమ్ చేశాడు. అందులో భాగంగా ఓ పరి అనే వీడియో సాంగ్ విడుదల చేశాడు. కేవలం నెల రోజుల్లో ఇరవై మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మంచి క్యాచీ ట్యూన్ తో యూత్ ని ఆకట్టుకునేలా సాగడంతో పాటు దేవి అందులో యూత్ హీరో మాదిరి మంచి స్టైలింగ్ డాన్సులు గట్రా చేశాడు. ఒకరకంగా చెప్పాలనుంటే ఏదో హీరో వేషం కోసం ట్రయిల్ గా అనిపించింది.

కాకపోతే ఇందులో రామా రామా కృష్ణ కృష్ణ అంటూ దేవుళ్ళను స్తుతించేలా కొన్ని లైన్స్ పెట్టి వాటిని పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిల మధ్య షూట్ చేయడం వివాదానికి తావిచ్చింది. టాలీవుడ్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి దీని మీద హిందూ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఏకంగా పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఈ తరహా వివాదమే పుష్ప టైంలోనూ ఎదురుకున్న దేవికి ఇప్పుడీ ఇష్యూ వల్ల ఏదో జరిగిపోతుందని కాదు కానీ తమన్ తో పోటీ తీవ్రంగా ఉన్న టైంలో పాటలతో టాక్ అవ్వాలి కానీ ఇలాంటివాటితో కాదు. గతంలో ఒక్కడు, రామ్ నటించిన రామరామ కృష్ణకృష్ణ లాంటి సినిమాల్లోనూ దేవుడి పేర్ల మీద ఫాస్ట్ బీట్స్ కలిపి వాడారు. అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడే ఎందుకు వచ్చిందో.

Show comments