iDreamPost
android-app
ios-app

లైగర్ నష్టాలు – అంతులేని కథ

లైగర్ నష్టాలు – అంతులేని కథ

అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత గుర్తొస్తోంది ఈ మధ్య కాలంలో కొన్ని డిజాస్టర్ల కథలు వింటుంటే. కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని కోట్ల రూపాయలు ముందు వెనుక చూడకుండా కుమ్మరించడం, తీరా అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలయ్యాక లబోదిబో మంటూ నిర్మాతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. కంటెంట్ ఎలా ఉందో చూసుకోకుండా, కనీసం ట్రైలర్ చూశాక ఓ అంచనాకు రాకుండా గుడ్డిగా పందెం కాస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. బయ్యర్లు ఉన్నంత అమాయకంగా ప్రేక్షకులు ఉండరుగా. అయ్యో పాపం తీశారనే జాలితోనో సానుభూతితోనే ఫలానా సినిమాకు టికెట్లు కొని వసూళ్లు కురిపించిన దాఖలాలు చరిత్రలో ఎప్పుడూ లేవు.

ఇప్పుడీ ప్రస్తావన కారణం లైగర్. ప్యాన్ ఇండియా లెవెల్ లో ఓవర్ ప్రమోషన్ చేసి వాట్ లాగా దేంగే అంటూ పదే పదే మంత్రంలా జపించిన ఈ బాక్సింగ్ ఎంటర్ టైనర్ ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో చూశాం. మొదటి రోజు సాయంత్రానికే జనం లేక థియేటర్లు వెలవెలబోయాయి. కట్ చేస్తే వంద కోట్ల దాకా బిజినెస్ చేస్తే కనీసం సగం కూడా వెనక్కు రాలేదు. ఇప్పుడు పంపిణీదారులు పూరి జగన్నాధ్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్త పరిశ్రమలో కలకలం రేపింది. తాను ఇస్తానన్నా ఇలా ఓవరాక్షన్ చేస్తే ఒక్క పైసా ఇవ్వనని తీవ్ర స్వరంలో పూరి ఒక ఫోన్ కాల్ లో అన్న మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి

ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో కానీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లకు పూరికి మధ్య పెద్ద గ్యాపే తెచ్చేలా ఉంది. ఆ మధ్య ఆచార్య విషయంలోనూ ఇలాంటి రగడే జరిగింది. నిర్మాణ భాగస్వామిగా ఉన్నందుకు దర్శకుడు కొరటాల శివ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిజానికి నష్టాలు వచ్చినప్పుడు రిటర్న్ చేయాలనే రూల్ లేకపోయినా అడ్వాన్స్ పద్ధతిలో అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు రాసుకుంటారు. కానీ వాటిని ఖచ్చితంగా పాటించే పరిస్థితులు ఉండవు. అందుకే ఈ చిక్కులు. అజ్ఞాతవాసి, బాబా, స్పైడర్ ఇలా చాలా డిజాస్టర్లు గతంలో ఇలా రచ్చ చేసినవే. కానీ లైగర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లేలా ఉంది. ఇండస్ట్రీ పెద్దలు సర్దుబాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారట.