iDreamPost
android-app
ios-app

చరణ్ అర్జున్ మల్టీస్టారర్ సాధ్యమేనా..

చరణ్ అర్జున్ మల్టీస్టారర్ సాధ్యమేనా..

ఇటీవలే ఆలీతో చేసిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ తానెప్పటి నుంచో రామ్ చరణ్ అల్లు అర్జున్ లతో ఒక మల్టీ స్టారర్ తీసే ప్లానింగ్ జరుగుతోందని, టైటిల్ చరణ్ అర్జున్ అని ఫిక్స్ చేసుకుని ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూవల్ చేస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంబోకి కథ రాయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ పుణ్యమాని మెగా పవర్ స్టార్ ఇమేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయింది. పుష్ప 1 వల్ల బన్నీ నార్త్ లోనూ మోస్ట్ పాపులర్ యాక్టర్ అయ్యాడు. కేరళ వరకే పరిమితమైన ఇతని మార్కెట్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ అమాంతం పెరిగిపోయింది. ఈ ఇమేజ్ లను బ్యాలన్స్ చేయడం సులభం కాదు.

అసలు మల్టీ స్టారర్లంటేనే టాలీవుడ్ లో పెద్ద రిస్కుతో కూడుకున్న పని. ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 80 దశకంలో శోభన్ బాబు కృష్ణల కలయికలో మహా సంగ్రామం వచ్చింది. భారీ బడ్జెట్ తో ఖైదీ నిర్మాతలు ప్రొడ్యూస్ చేశారు. తమ హీరో పాత్రకు ప్రాధాన్యం తగ్గిందని నట భూషణుడి ఫ్యాన్స్ గొడవ పడితే ఇకపై ఇలాంటి ఇద్దరు హీరోల సినిమాలు ఒప్పుకోనని శోభన్ బాబు పబ్లిక్ గా చెప్పాల్సి వచ్చింది. అదే తరహాలో వారసుడు మూవీలో సూపర్ స్టార్ కృష్ణ క్యారెక్టర్ ని క్లైమాక్స్ లో చంపడం, ఆయన కాలర్ ని నాగార్జున పట్టుకోవడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళకు సర్దిచెప్పేందుకు నాగ్ కృష్ణలతో పాటు నిర్మాత మురళీమోహన్, దర్శకుడు ఈవివికి చుక్కలు కనిపించాయి.

అంతెందుకు ఆర్ఆర్ఆర్ టైంలోనూ తారక్ చరణ్ అభిమానులు రెండుగా విడిపోయి మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ ట్విట్టర్ వేదికగా గొడవలు పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. అసలే మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య సరిగా పొసగడం లేదనే విషయం సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి చెప్పొచ్చు. కాకపోతే ఈ మధ్య అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్లో వాళ్ళ మధ్య అలాంటి విభేదాలు ఉన్నట్టు కనిపించకపోవడంతో ఇబ్బందేం లేనట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒకవేళ అరవింద్ చెప్పినట్టు నిజంగానే చరణ్ అర్జున్ కనక కార్యరూపం దాలిస్తే రికార్డులు కొల్లగొట్టడం ఖాయం..