శాండల్ వుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ కాంతార దీపావళికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా దూకుడు మాత్రం ఆపడం లేదు. కొత్త రికార్డులను ఖాతాలో వేసుకునే పనిలో ఉంది. నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ నుంచి వచ్చిన చిత్రాలన్నిటిలోనూ అత్యధిక ఫుట్ ఫాల్స్ తెచ్చుకున్న మూవీగా మరో బెంచ్ మార్క్ సెట్ చేసుకుంది. కెజిఎఫ్ 2 పేరు మీద 77 లక్షల మార్కును దాటేసి కాంతార ప్రస్తుతం 90 లక్షలను అందుకునే పనిలో ఉంది. ఈ వారంలోనే ఇది కోటికి చేరుతుంది. ఇది శాండల్ వుడ్ లోనే హయ్యెస్ట్ కాకపోయినా కెజిఎఫ్ ని క్రాస్ చేయడం మాత్రం సంచలనమే. స్వయంగా ప్రొడక్షన్ హౌసే మీడియాకు వెల్లడించడంతో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.
ఇక వసూళ్ల విషయానికి వస్తే కాంతార ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 15 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇంత మొత్తంలో ఒక కన్నడ డబ్బింగ్ సినిమా కలెక్షన్లు సాధించడం ఇది మూడో సారి మాత్రమే. కెజిఎఫ్ 2 పేరు మీద తొలిస్థానం ఉంది. కానీ దానికి ఇచ్చిన టికెట్ రేట్లు, స్క్రీన్ కౌంట్, జరిగిన బిజినెస్ దృష్ట్యా కాంతార చాలా చిన్నది. అయినా రెండో ప్లేస్ దక్కడం మాత్రం విశేషమే. ఇంకో రెండు మూడు వారాలు ఖచ్చితమైన స్మూత్ రన్ ఉన్న నేపథ్యంలో 20 కోట్ల ఫిగర్ ని రీచ్ కావడం మరీ అసాధ్యమైతే కాదు. ఒకవేళ అదే జరిగితే పెట్టుబడికి పదింతలు లాభం తెచ్చిన అరుదైన ఘనత కాంతారకే దక్కుతుంది. అందుకే ప్రమోషన్ల విషయంలో టీమ్ యాక్టివ్ గా ఉంది.
కేవలం రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన కాంతారకు ఇంత రెస్పాన్స్ రావడం ఊహకందనిది. కెజిఎఫ్ 1 తెచ్చింది 13 కోట్లే. అది కూడా అంత హైప్ లో. కానీ సైలెంట్ కిల్లర్ గా వచ్చిన కాంతార ఊహకందని రీతిలో ఇన్ని సంచలనాలు నమోదు చేసింది.
ఇంకా మెయిన్ సెంటర్స్ లో రన్ స్ట్రాంగ్ గా ఉంది. మొన్న పండగ వీకెండ్ కూడా ఆధిపత్యం సాధించింది. జిన్నా, ప్రిన్స్ కన్నా హౌస్ ఫుల్ బోర్డులు ముందు దీనికే పడ్డాయి. వచ్చే నెల 4న అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి స్ట్రీమింగ్ ఉండొచ్చనే టాక్ ఉంది కానీ అదెంతవరకు నిజమో ఇంకొద్ది రోజులు ఆగితే స్పష్టత వస్తుంది. రిషబ్ శెట్టి హీరో కం దర్శకుడిగా రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు సీక్వెల్ ఉండదట.