పెద్దగా అంచనాలు లేకుండా కేవలం కర్ణాటకలో బాగా ఆడితే చాలనుకున్న కాంతార అక్కడి కంటే మెరుగ్గా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబట్టడం, హిందీ తమిళ వెర్షన్లలోనూ మంచి వసూళ్లు తెచ్చుకోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ఒక ప్రాంతానికి పరిమితమైన కొళ నృత్య నేపధ్యాన్ని తీసుకుని దర్శకుడు ప్లస్ హీరో రిషబ్ శెట్టి తీర్చిదిద్దిన తీరు జాతీయ స్థాయిలో ప్రశంసలు తెచ్చి పెడుతోంది. ఓవర్సీస్ లో పొన్నియన్ సెల్వన్ కు ధీటుగా అదరగొడుతోంది. దీని దెబ్బకే వీకెండ్ లో మళ్ళీ పికప్ అవుతుందన్న గాడ్ ఫాదర్ ఓ మోస్తరుగా నడవగా, ది ఘోస్ట్ స్వాతిముత్యం లాంటి వాటికి కనీస ఆదరణ కరువయ్యింది. అంతగా కాంతార ప్రభావం బాక్సాఫీస్ మీద ఉంది.
ఇక్కడ కాంతార నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మన దగ్గరా గతంలో ఇలా నేటివిటీ ఆధారంగా రూపొందిన సినిమాలు ఉన్నాయి. కానీ కమర్షియల్ గా పెద్ద స్కేల్ కు వెళ్ళినవి తక్కువ. పలాస, మల్లేశం, కుబుసం, మా భూమి లాంటివి విమర్శకుల మెప్పులు పొందాయే తప్ప ప్రేక్షకుల నుంచి పెద్ద మొత్తంలో కాసులు తేలేకపోయాయి. కానీ కాంతార ఈ విషయంలో ఫెయిల్ కాలేదు. ఆచారాలు, నమ్మకాల మధ్య కథ నడిపిస్తునే డ్రామా ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా అటవీ నేపథ్యం, క్యాస్టింగ్, విజువల్స్, కమర్షియల్ అంశాలకు చోటివ్వకపోవడం లాంటివి చాలా ప్లస్ అయ్యాయి. ఇంత గొప్ప విజయానికి కారణమయ్యాయి.
ఇకపై ఇతర భాషల్లోనూ ఈ తరహా ప్రయత్నాలు జరిగాలి. కంటెంట్ బలంగా ఉంటే రియలిస్టిక్ సినిమాలకూ పెద్ద సక్సెస్ దక్కి తీరుతుందని అర్థమయ్యింది. ఆ మధ్య 777 ఛార్లీ సైతం ఇదే కన్నడ నుంచి డబ్బింగ్ చేసుకొచ్చి మంచి విజయం నమోదు చేసుకుంది. ఎంతసేపూ నవ్వు రాని జోకులతో బడ్జెట్ సినిమాలు, రొటీన్ దారిలో వెళ్లే కమర్షియల్ మూవీస్ తీస్తూ పోతే జనం థియేటర్లకు వచ్చేందుకు సుముఖత చూపించరు. అందుకే కాంతారతో పాటు రిలీజైన ఇతర చిత్రాలు కనీస ఆక్యుపెన్సీ లేక నష్టాలు కొని తెచ్చుకున్నాయి. విజువల్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేస్తున్న ఆడియన్స్ ని ఇకపై మెప్పించాలంటే ఆషామాషీ కథలతో కుదరదు. బింబిసార, కార్తికేయ 2, సీతారామం లాంటి హిట్లే దానికి మంచి ఉదాహరణ.