Raayan Telugu Movie Review & Rating: ధనుష్ హీరోగా నటిస్తోన్నరాయన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే..
Raayan Telugu Movie Review & Rating: ధనుష్ హీరోగా నటిస్తోన్నరాయన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే..
Dharani
విభిన్నమైన చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో సపరేట్ స్టార్ డమ్ దక్కించుకున్న హీరో ధనుష్. ఈ వర్సటైల్ యాక్టర్ తన 50వ చిత్రంగా రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకి కథతో పాటు, దర్శకత్వం కూడా ధనుష్ చేయడం విశేషం. మరి.. ఇంత ప్రత్యేకమైన మూవీతో ధనుష్ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కార్తవరాయన్ (ధనుష్) తల్లితండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోతారు. ఇద్దరు తమ్ముళ్లు, (సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్), చెల్లి దుర్గ (దుషార విజయన్) ని పెంచే బాధ్యత కార్తవరాయన్ పై పడుతుంది. వీళ్ళే లోకంగా కార్తవరాయన్ జీవితం సాగుతుంది. ఈ ప్రయాణంలో శేఖర్ (సెల్వరాఘవన్) వీరికి పెద్ద దిక్కుగా ఉంటారు. అయితే.. అదే ఊరిలో దురై (శరవణన్), సేతు (ఎస్ జే సూర్య) మధ్య ఉండే గ్యాంగ్ వార్ కారణంగా కార్తవరాయన్ జీవితంలో అలజడి మొదలవుతుంది. ప్రాణంగా పెంచుకున్న తమ్ముళ్లు, చెల్లులు ఆ ఊబిలోకి దిగాల్సి వస్తుంది. ఇలాంటి స్థితి నుండి రాయన్ తన వాళ్ళని కాపాడుకున్నాడా? లేదా? ఈ ప్రయాణంలో రాయన్ ఎవరిని కోల్పోవాల్సి వచ్చింది? అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే ఈ చిత్ర కథ.
టాలీవుడ్, కోలీవుడ్ మధ్య డిస్టెన్స్ తక్కువే ఉన్నా.. ఎమోషన్స్ విషయంలో మాత్రం వీటి రెండిటి మధ్య గ్యాప్ పెద్దది. తమిళ ప్రేక్షకులు విషాదాన్ని ఆదరించే రీతిలో.. తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు. ముఖ్యంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఎక్కువ విషాదం ఉన్నా, కథలో అతను నామ మాత్రపు వ్యక్తిగా మిగిలిపోయినా ఇక్కడ ఫలితం తేడా కొట్టేస్తుంది. ఇప్పుడు రాయన్ విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమాలో ధనుష్ క్యారెక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసినా, ఆ పాత్ర వల్ల కథ, కథనానికి వచ్చిన ఎలాంటి అదనపు బలం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకానొక సమయానికి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు, సినిమాలో నటిస్తోన్న ధనుష్ పాత్ర రెండు సమానం అయిపోతాయి అంటే.. రాయన్ మూవీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
రాయన్ మూవీ మంచి ఎమోషనల్ టచ్ తో మొదలవుతుంది. అక్కడ నుండి కథనం సాగే తీరు కూడా మన నేటివిటీకి తగ్గట్టే అద్భుతంగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ ఆఫ్ లో ఆడిటోరియం మూడ్ చెడిపోకుండా.. సందీప్ కిషన్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. లవ్ ట్రాక్ తో పాటు, మాస్ బిల్డప్ తో అతని క్యారెక్టర్ ఎంటర్టైన్ చేస్తుంటే.. అండర్ ప్లేలో ధనుష్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్లిన విధానం నిజంగా బాగుంది. ఇక కథలో గ్యాంగ్ వార్ మొదలయ్యాక కార్తవరాయన్ (ధనుష్) ఎక్స్ పోజ్ అవ్వడం మొదలు అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ తో కథ టర్న్ అవ్వడం, పక్కా మాస్ మసాలా బ్యాంగ్ తో ఇంటర్వెల్ ముగియడంతో రాయన్ సరైన ట్రాక్ లోనే ఉంది, ఇక కథనంతో అదరగొట్టడమే తరువాయి అన్న ఆశ పుడుతుంది.
సెకండ్ ఆఫ్ మొదలైనప్పుడు నుండి రాయన్ కథనం చుట్టూ తమిళ వాసనలు అల్లుకోవడం మొదలు అవుతుంది. అప్పటి వరకు క్యారెక్టర్స్ పైన డ్రైవ్ అయిన మూవీ అంతా.. కథలోకి వెళ్లే సరికి కిచిడి అయిపోయింది. క్యారెక్టర్స్ బిహేవియర్స్ సడెన్ గా మారిపోతుంది. పోనీ.. అలా ఎందుకు టర్న్ అవుతుందో చెప్పే జస్టిఫికేషన్ సీన్స్ కూడా ఉండవు. అప్పటి వరకు మనకి చూపించిన స్టోరీ పోగ్రెషన్ అంతా వృథా అయిపోయి.. మరో కొత్త సినిమాకి వచ్చామా అనే చిరాకు పుట్టేస్తుంది. ఈ మొత్తం తతంగంలో హీరో చిన్ననాట కన్న కలలు అన్నీ చెదిరిపోతాయి. ఇంత అయోమయంలో విలన్, హీరో, అతని తమ్ముళ్లు అందరి పాత్రలు తేలిపోతాయి. ఇక రాయన్ క్లైమ్యాక్స్ అయితే సదురు తెలుగు ప్రేక్షకులకి అస్సలు నచ్చే అవకాశమే లేదు. దీంతో.. ఎక్కడో నిలవాల్సిన రాయన్.. ధబేల్మని కిందపడిపోయి అతిసాధారణ చిత్రంగా ముగుస్తుంది.
నటుడిగా ధనుష్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాయన్ పాత్రలో లీనమై నటించాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది మాత్రం సందీప్ కిషన్ క్యారెక్టర్. చాలా షేడ్స్ ఉన్న రోల్ ని సందీప్ అవలీలగా చేసి పడేశాడు. ఎదురుగా ధనుష్ ఉన్నా.., తన మార్క్ చూపించాడు అంటే మామూలు విషయం కాదు. అయితే.., నటుడిగా సందీప్ మెప్పించినా.. అతను ఈ పాత్ర చేయకుండా ఉంటేనే బాగుండేది. సందీప్ కిషన్ ని ఇలాంటి రోల్ లో చూడటం తెలుగు ఆడియన్స్ కి నిరాశ కలిగిస్తుంది. ఇక సెల్వరాఘవన్, ఎస్.జే. సూర్య, ప్రకాశ్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి పర్ఫెక్ట్ ప్యాడింగ్ ఉన్నా.. ఎవ్వరిని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారు. ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ రాయన్ చిత్రంలో.. చెల్లి పాత్ర చేసిన దుషార విజయన్.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. టెక్నికల్ గా రాయన్ అక్కడక్కడ మెరిపించింది. ముఖ్యంగా ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. రెహ్మాన్ మ్యూజిక్ లో అంతగా మెరుపులు కనిపించలేదు. మేకింగ్ లో ధనుష్ లోని దర్శకుడికి పాజిటివ్ మార్క్స్ పడుతాయి. కాకపోతే.. కథ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం రిచ్ గా కనిపించాయి.
చివరి మాట: రాయన్.. ఇంకాస్త శ్రద్ద తీసుకొని రాసుంటే బాగుండేది.