Bharateeyudu 2 Review & Rating In Telugu: ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 నేడు అనగా జూలై 12న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది అంటే..
Bharateeyudu 2 Review & Rating In Telugu: ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 నేడు అనగా జూలై 12న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది అంటే..
Dharani
భారతీయుడు.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యద్భుతమైన చిత్రాల్లో ఒకటి. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా “భారతీయుడు -2” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన “భారతీయుడు-2” మూవీ ఎలా ఉందో.. ఈ రివ్యూలో తెలుసుకుందాం
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్) ఓ సాధారణ యూట్యూబర్. తన స్నేహితులతో కలిసి.. సమాజంలో జరిగే అన్యాయాలపై వీడియోస్ చేస్తూ, న్యాయం కోసం తన వంతుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ.., సమాజంలోని అవినీతిపరులను ఎదుర్కోవడానికి వీరి శక్తి సరిపోదు. దీంతో వీరంతా కలిసి సోషల్ మీడియాలో “కమ్ బ్యాక్ ఇండియన్” అనే ట్రెండ్ సృష్టిస్తారు. విదేశాల్లో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడు (కమల్ హాసన్) ఇవన్నీ తెలుసుకొని తిరిగి ఇండియాకి వస్తాడు. తాను దేశంలో అడుగు పెట్టే ముందే అవినీతిపరుల ఏరివేత మొదలు పెడుతాడు. ఇక దేశంలోకి వచ్చాక మరో హత్య చేసి, యువతకి ఓ సందేశం పంపిస్తాడు. దాని కారణంగా దేశంలో అవినీతిపరుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. కాకపోతే.., ఈ సందేశం కారణంగానే చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్) ఇంట్లో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. ఇక్కడ నుండి సామాన్య జనం సేనాపతిపై తిరగబడతారు. ఇంతకీ భారతీయుడుగా సేనాపతి ఇచ్చిన సందేశం ఏంటి? దాని వల్ల దేశంలో ఏమి జరిగింది? ప్రజలు ఆయనపై ఎందుకు ద్వేషం పెంచుకున్నారు అన్నదే ఈ చిత్ర కథ
“భారతీయుడు” సినిమా చూసిన అందరికీ సేనాపతి ఎంత గొప్ప దేశభక్తుడో తెలిసే ఉంటుంది. దేశం కోసం, అవినీతి నిర్మూలన కోసం సొంత కొడుకుని కూడా చంపి.. ఆయన దేశ ప్రజల దృష్టిలో హీరో అవుతాడు. అలాంటి సేనాపతిని “భారతీయుడు-2” సినిమాలో సామాన్య జనం చీపుర్లు, కర్రలు తీసుకుని తరుముతారు. అది కూడా ఒక అవినీతిపరుడు భార్య చావుకి పరోక్షంగా కారణం అయ్యాడు అని! చాలా షాకింగ్ గా ఉంది కదా? శంకర్ ఈ సినిమాలో సేనాపతి పాత్ర స్థాయిని అంతగా దిగజార్చేశాడు. దీనిబట్టి భారతీయుడు-2 కథ, కథనం ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ లో సేనాపతి పాత్రని కథలోకి తీసుకుని రావడానికి శంకర్ ఎస్టాబ్లిష్ సీన్స్ బాగానే రాసుకున్నాడు. కానీ.., ఆ సేనాపతి వచ్చాక సినిమా పూర్తిగా చప్పబడిపోయింది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కి అయినా “భారతీయడు-2” సరైన ట్రాక్ లోకి వస్తది అనుకుంటే అదీ జరగదు. చాలా సాధారణ సినిమా చూస్తున్న ఫీల్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది.
“భారతీయుడు-2” సెకండ్ ఆఫ్ లోకి వచ్చాక కథనం పూర్తిగా ట్రాక్ తప్పేసింది. ఒకవైపు సేనాపతి హత్యలు చేస్తూ ఉంటాడు. కానీ.., వాళ్ళని ఎందుకు చంపుతున్నాడో తెలిసేలా ఒక్క సీన్ కూడా ఉండదు. క్రికెట్ కామెంట్రీలా కమల్ వాళ్ళ తప్పులు చదవడం, చంపడం ఇదే రిపీట్ మోడ్ లో జరుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు.. సిద్ధార్థ్ అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ పూర్తిగా తేలిపోతాయి. ఇంత నీరసంగా సాగే సినిమాలో.. సిద్ధార్థ్, సముద్రఖని ఎపిసోడ్ కాస్త బెటర్ అనిపిస్తుంది. కాకుంటే.. అది మొత్తం కథలో సబ్ లేయర్ కాబట్టి అంతగా ప్రేక్షకుడికి కిక్ ఇవ్వదు. మూడు గంటల సినిమాలో చివరి అరగంట అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మిగిలిపోతుంది. సేనాపతి పారిపోయి, పారిపోయి.. ఓ నిందితుడిలా ప్రేక్షకుల ముందు నిలబడం ఏదైతే ఉంటుందో.. ఆ సీక్వెన్స్ మొత్తం సినిమా ఫీల్ ని చెడకొడుతుంది. ఓవరాల్ గా ఎలాంటి హై ఇవ్వకుండానే “భారతీయుడు-2” చప్పగా ముగుస్తుంది.
కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్తే.. ఆయన స్థాయిని తగ్గించినట్టు అవుద్ది. కాకపోతే.. లుక్ మాత్రం అసలు సెట్ కాలేదు. ఇదే సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. ఇక చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. కాకపోతే.. ఇందులో అతనిది స్టోరీని డ్రైవ్ చేసే అంత డెప్త్ క్యారెక్టర్ కాదు. ఇక రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ తేలిపోయాయి. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు మైనస్ గా మారింది. ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకపోతే.. శంకర్ స్క్రీన్ ప్లేనే ఈ తప్పుకి కారణం. ఇక రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాణ విలువలు శంకర్ సినిమా స్థాయిలో అయితే లేవు. బట్ ఓకే అని చెప్పుకోవచ్చు. ఇక దర్శకుడిగా శంకర్ టెక్నికల్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ విభాగంలో ఆయన సక్సెస్ అయ్యారు కూడా. కానీ.., రచయతగా మాత్రం ఆయన పూర్తిగా విఫలం అయ్యారు. ఇదే “భారతీయుడు-2” అతిపెద్ద శాపంగా మారింది.
చివరి మాట: “భారతీయుడు-2” చాలా భారంగా నడిచింది