iDreamPost
android-app
ios-app

విద్యార్థులు టెన్త్ తర్వాత ఈ కోర్సులు చేస్తే.. భవిష్యత్తుకు తిరుగుండదు

విద్యార్థులు పదోతరగతి పూర్తి చేసిన తర్వాత తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటే పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేస్తే భవిష్యత్ బంగారమే.

విద్యార్థులు పదోతరగతి పూర్తి చేసిన తర్వాత తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటే పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేస్తే భవిష్యత్ బంగారమే.

విద్యార్థులు టెన్త్ తర్వాత ఈ కోర్సులు చేస్తే.. భవిష్యత్తుకు తిరుగుండదు

మరికొన్ని రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలను సాధించేందుకు స్టూడెంట్స్ శ్రమిస్తున్నారు. టెన్త్ క్లాస్ ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ. ఇక్కడ విద్యార్థి చూపించిన ప్రతిభ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి టెన్త్ పూర్తయ్యాక విద్యార్థులు త్వరగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకోవాలన్నా, ఉజ్వల భవిష్యత్తు పొందాలన్నా ఏ కోర్సులు చేయాలో తెలియక తికమకపడుతుంటారు. అయితే పదో తరగతి అనంతరం ఈకోర్సులు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు తిరుగుండదని అంటున్నారు నిపుణులు. మరి ఆ కోర్సులు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టూడెంట్స్ టెన్త్ తర్వాత చదువు కొనసాగించేందుకు చాలా మార్గాలున్నాయి. భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దే బెస్ట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకప్పుడు పదోతరగతి కంప్లీట్ అవ్వగానే ఎక్కువ మంది ఇంటర్ మీడియట్ లో చేరేవారు. ప్రస్తుతం టెక్నికల్ ఎడ్యుకేషన్ కు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో టెక్నికల్ విభాగాల్లో చేరేందుకే స్టూడెంట్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇంటర్మీడియెట్‌తోపాటు పాలిటెక్నిక్, ఐటీఐ, అగ్రికల్చర్‌ డిప్లొమాలు, అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ సామర్థ్యాలను, కోర్సులపై ఉండే అభిరుచులను బట్టి కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.

టెన్త్ తర్వాత ఇంటర్ లో చేరాలనుకుంటే:

  • ఇంటర్ మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌లు ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఎంపీసీ ఎంచుకున్నట్లైతే ఇంజనీరింగ్ కెరీర్ కు బంగారు బాటలు వేసుకోవచ్చు. డిఫెన్స్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రాణించొచ్చు.
  • విద్యార్థులకు మెడిసిన్ పై ఇంట్రెస్టు ఉంటే బైపీసీ కోర్సులో చేరొచ్చు. వైద్యరంగంలో భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ తదితర మెడిసిన్, అనుబంధ కోర్సుల్లో చేరొచ్చు. వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ సైన్స్‌ వంటి విభాగాల్లోనూ ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. బైపీసీతో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో విసృతమైన అవకాశాలు ఉంటాయి. లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వొచ్చు.
  • సీఈసీ కోర్సుతో కార్పొరేట్‌ కెరీర్‌ లో రాణించొచ్చు. చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కార్పొరేట్‌ కంపెనీల్లో ఇంటర్నల్‌ ఆడిటర్స్, స్టాక్‌ ఆడిటర్స్, ఫైనాన్షియల్‌ మేనేజర్స్, అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటరీస్‌ వంటి వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు సొంత చేసుకోవచ్చు. ఇక ఎంఈసీ కోర్సుతో కూడా ఇదే విధమైన అవకాశాలు అందుకోవచ్చు.

పాలిటెక్నిక్‌:

  • విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సును ఎంచుకుంటే ఇంజనీరింగ్ విభాగంలో రాణించవచ్చు. పాలిటెక్నిక్ పూర్తైన తర్వాత బీటెక్ కోర్సులు చేయొచ్చు. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కెమికల్, మెటలర్జీ బ్రాంచ్‌లు ఉంటాయి. పాలిటెక్నిక్ విద్యతో పరిశ్రమల్లో ఉద్యోగాలు అందుకోవచ్చు.

ఐటీఐ:

  • టెన్త్ తర్వాత వృత్తి విద్య శిక్షణ, స్వయం ఉపాధి అందుకోవాలంటే ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ తదితర పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఎంట్రీ లెవల్లో టెక్నీషియన్స్‌గా అడుగు పెట్టొచ్చు. అదే విధంగా అప్రెంటీస్‌ షిప్‌ పూర్తి చేసుకుని ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌ పొందితే రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.

అగ్రి పాలిటెక్నిక్స్‌:

  • భారతదేశం వ్యవసాయాధారిత దేశం. రైతులకు పంటలో మేలైన దిగుబడులు రావాలంటే ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం, యంత్ర పరికరాల వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం అగ్రి పాలిటెక్నిక్ విద్యాసంస్థలను నెలకొల్పింది. వీటిలో డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ముఖ్యమైనవి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, సీడ్ కంపెనీలు వంటివాటిలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.