Venkateswarlu
Venkateswarlu
ఓ వృద్దుడు చేతి సంచితో ఆటో ఎక్కాడు. ఆటో రోడ్డుపై వెళుతుండగా.. డ్రైవర్‌కు చంటి బిడ్డ ఏడుపు వినిపించటం మొదలైంది. ఆ ఏడుపు ఎక్కడినుంచి వస్తోందో తెలియక ఆ ఆటో డ్రైవర్ దిక్కులు చూశాడు. తర్వాత తన ఆటోలోంచే ఆ ఏడుపు వినిపిస్తోందని తెలిసి షాక్ అయ్యాడు. ఆటోను ఆపి వెనక సీటు దగ్గరకు రాగా.. ఆ ఏడుపు ముసలాయన చేతి సంచిలోంచి వస్తోందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆటోను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అసలు విషయం బయట పడింది. పోలీసులు తెలిపిన ఆ వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డి గూడెంకు చెందిన ఓ మహిళ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా, డెలివరీ అయింది.
ఆమె ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు బిడ్డల్లో ఓ బిడ్డ ఆరోగ్యం బాగా లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె ఆ బిడ్డను వదులుకోవటానికి సిద్ధపడింది. నర్సు సహాయంతో బిడ్డను ఓ వృద్ధుడికి అప్పగించారు. ఆ వృద్ధుడు బిడ్డను చేతి సంచిలో వేసుకుని అక్కడి నుంచి బయలు దేరాడు. రోడ్డుపైకి రాగానే ఓ ఆటో ఎక్కాడు. చంటి బిడ్డ పాలకోసం ఏడుస్తుండటంతో అసలు విషయం బయటపడింది. ఆటో డ్రైవర్‌కు అనుమానం రావటంతో వృద్ధుడు పోలీస్ స్టేషన్ పాలయ్యాడు.
ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తల్లిదండ్రుల తీరుతో ఆశ్చర్యానికి గురయ్యారు. బిడ్డ ఆరోగ్యం బాగాలేదని వదలించుకోవటానికి చూడ్డాన్ని వారు తప్పుబట్టారు. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ బిడ్డ తల్లిండ్రులు ఎవరు? నిజంగానే ఆ వృద్ధుడికి ఇచ్చారా? లేక అతడే బిడ్డను ఎత్తుకొచ్చాడా? అన్న కోణంలో విచారిస్తున్నారు. మరి, బిడ్డ ఆరోగ్యం సరిగా లేదని వదలించుకోవటానికి చూసిన తల్లిదండ్రుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.