iDreamPost
android-app
ios-app

రైల్లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి.. ఫలితం అనుభవించాడు!

రైల్లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి.. ఫలితం అనుభవించాడు!

రైల్లో ప్రయాణిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డ వ్యక్తికి పోలీసులు దారుణమైన శిక్ష వేశారు. సదరు రౌడీని వెతికి పట్టుకుని మరీ ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అతడితో పాటు మరో ఇద్దరు  గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెలలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ సరియు ఎక్స్‌ప్రెస్‌లో రైల్లో ప్రయాణిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య దగ్గర అనీస్‌ ఖాన్‌ అనే రౌడీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

అనీస్‌ దాడిలో ఆమె తలతో పాటు శరీరానికి గాయాలయ్యాయి. దాడి అనంతరం అనీస్‌ ట్రైన్‌ దిగి పారిపోయాడు. నెత్తుటి మడుగులో పడి ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను లక్నోలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం అన్వేషించసాగారు. శుక్రవారం అనీస్‌ ఎక్కడ ఉన్నాడో పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారు అతడ్ని పట్టుకోవటానికి అతడుంటే ప్రదేశానికి వెళ్లారు.

పోలీసులు తనను పట్టుకోవటానికి వచ్చారని తెలియటంతో అతడు దాడికి దిగాడు. ఇక, తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అనీస్‌ పోలీసుల తూటాలకు బలయ్యాడు. అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరి, రైల్లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి.. చివరకు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అనీస్‌ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.