iDreamPost
android-app
ios-app

ఆనంద్‌ మహీంద్రాపై కేసు నమోదు.. తన కొడుకు మృతికి కారణమంటూ ఓ తండ్రి ఫిర్యాదు

  • Published Sep 26, 2023 | 1:04 PM Updated Updated Sep 26, 2023 | 1:05 PM
  • Published Sep 26, 2023 | 1:04 PMUpdated Sep 26, 2023 | 1:05 PM
ఆనంద్‌ మహీంద్రాపై కేసు నమోదు.. తన కొడుకు మృతికి కారణమంటూ ఓ తండ్రి ఫిర్యాదు

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. సామాన్యులకు కూడా పరిచయమే. బడా బిజినెస్‌మ్యాన్‌గా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉన్నప్పటికి.. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. లోకల్‌ టాలెంట్‌కు సంబంధించి.. ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. చాలా మందికి తమ కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చారు. ఇక ఆనంద్‌ మహీంద్రా అనగానే సామాన్యులకు వెంటనే గుర్తుకు వచ్చేది.. సోషల్‌ మీడియాలో ఆయన చేసే పోస్టులే. అయితే ప్రస్తుతం మాత్రం అందుకు రివర్స్‌ సన్నివేశం ఒకటి వెలుగు చూసింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా మీద కేసు నమోదు చేశారు పోలీసులు. తన కుమారుడి మరణానికి కారణమయ్యాడంటూ.. ఓ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆనంద్‌ మహీంద్రాపై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

ఆనంద్‌ మహీంద్రా వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ ఆయన మీద ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఆయనతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 12 మంది ఉద్యోగులపైనా కేసు పెట్టాడు. ఇంతకు విషయం ఏంటి అంటే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజేష్‌ మిశ్రా అనే వ్యక్తి.. 2020లో తన కుమారుడు అపూర్వ్‌ కోసం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్‌ స్కార్పియో కారును బహుమతిగా కొనిచ్చాడు. అప్పుడు ఆ కారు విలువ రూ. 17.39 లక్షలు. ఇలా ఉండగా.. రెండేళ్ల తర్వాత అనగా 2022 జనవరి 14 వ తేదీన అపూర్వ్‌ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది

పొగమంచు కారణంగా.. ఎదురుగా ఏం ఉందో కనిపించకపోవడంతో.. అపూర్వ్‌ వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటన తర్వాత జనవరి 29 వ తేదీన ఆ కారును మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి అందులో ఉన్న లోపాలను వారికి వివరించాడు రాజేష్‌.

తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాలేదని.. అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగులు లేవని ఆరోపించాడు. మహీంద్రా కంపెనీ ఎయిర్‌బ్యాగులు బిగించడంలో నిర్లక్ష్యం వహించిందని.. కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందని ఆరోపిస్తూ.. రాజేష్ మిశ్రా.. ఆనంద్‌ మహీంద్రాతో పాటు ఉద్యోగుల మీద కూడా చీటింగ్ కేసు పెట్టాడు.

అంతేకాక దీని గురించి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఉద్యోగులతో మాట్లాడేందుకు వెళ్లగా.. వారు తనను తిట్టారని.. చంపేస్తామని బెదిరించారని రాజేష్‌ మిశ్రా ఫిర్యాదులో పేర్కొన్నాడు. మోసం, వాహనాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం సహా మరికొన్ని ఇతర సెక్షన్ల కింద ఆనంద్ మహీంద్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్నానీతో పాటు మొత్తం 14 మందిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. మరి దీనిపై ఆనంద్‌ మహీంద్రా ఎలా స్పందిస్తారో చూడాలి.