P Krishna
P Krishna
మనిషికి మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరు అంటారు పెద్దలు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతూ చనిపోతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లినవారు తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తారా లేదా అన్న భయంతో ప్రతిరోజూ గడపాల్సి వస్తుంది. నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు.. ఉన్నత చదువు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుందని ఎంతో సంతోష పడ్డారు. కానీ ఆమెను ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నంద్యాల పట్టణానికి చెందిన ముల్లా షహిద(23) ఇటీవల ఉపాధి కోసం విశాఖపట్టణానికి వలస వచ్చారు. షహిద తల్లిదండ్రులు పెందుర్తి గాంధీనగర్ లో నివాసం ఉంటున్నారు. తండ్రి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కూతురిని బాగా చదివించాడు. వీరికి ఒక్కగానొక్క కూతురు షహిద. కొంతకాలంగా షహిద ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ.. పై చదువులకు ప్రిపేర్ అవుతుంది. సోమవారం స్కూల్లో ఓ విద్యార్థి భోజనం తీసుకురాకపోవడంతో తాను తెచ్చుకున్న టిఫిన్ ఆ విద్యార్థికి ఇచ్చింది. సాయంత్రం స్కూల్ టైమింగ్ పూర్తయిన తర్వాత షహిదకు బాగా ఆకలి వేసింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన ఉన్న హోటల్ కి వెళ్లి ఏదైనా తినాలని భావించింది. నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న సమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ వైపు అతి వేగంగా దూసుకువచ్చిన ఓ బైక్ ఆమెకు ఢీ కొట్టింది. అంతే అల్లంత దూరంలో ఎగిరిపడిపోయింది షహిద.
ఈ దారుణ ఘటనలో షహిదకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాలు విరిగింది, చేతులకు, తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి 108 వాహనంలో కేజీహెచ్ కు తరలిస్తుండగా అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మార్గ మధ్యలోనే కన్నుమూసింది. ఒక్కకానొక్క కూతురు మృత్యువడిలోకి వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదానికి కారణం అయిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షహిద కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పెందుర్తి సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.