భర్త ఆ పనిచేశాడని.. వివాహిత బలవన్మరణం!

ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ లోకి వెళ్లిపోయి పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఎదుటివారిపై దాడులు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తూ కుటుంబాలను విషాదంలో ముంచేస్తున్నారు. వేదమంత్రాల సాక్షిగా.. పెద్దల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంట ఏడాది తిరిగే లోపు విడాకులు తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. భర్తతో జరిగిన గొడవ కారణంగా రెండు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జనగామ జిల్లా రఘునాథ పల్లికి చెందిన మద్దూరి కృష్ణ-రేణ దంపతుల కుమార్తె అర్చన(20) కు పాలకుర్తి మండలానికి చెందిన వినేష్ తో ఈ ఏడాది మార్చి 10న వివాహం జరిగింది. ఈ మద్య అర్చనను హాస్పిటల్ కి తీసుకు వెళ్లి చూపించగా ఆమె రెండు నెలల గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి నేరుగా అర్చనను ఆమె పుట్టింటిలో వదిలి వెళ్లాడు వినేష్. గత నెల 31న వినేష్ తన అత్తగారింటికి వచ్చాడు. ఈ క్రమంలోనే అర్చన తన భర్త వినేష్ సెల్ ఫోన్ పరిశీలిస్తుండగా ఓ యువతితో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. దాంతో అనుమానం వచ్చిన అర్చన తన భర్తతో ఆ యువతి ఎవరు అని ప్రశ్నించింది.

ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. నువు చస్తే ఆమెను పెళ్లి చేసుకుంటా అంటూ అర్చనపై కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు వినేష్. భర్త వేరే యువతితో ఉండటం చూసి, ఆయన మాట్లాడిన మాటలు విని అర్చన తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పుకొని ఏడ్చింది. తాము అల్లుడితో మాట్లాడుతామని సర్ధి చెప్పారు అర్చన తల్లిదండ్రులు. ఈ ఘటన తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన అర్చన ఇంట్లో ఎవరూ లేనిది చూసి చీరతో ఉరివేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన పక్కింటి వారు ఆమెను విడిపించగా అప్పటికే ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది అర్చన. హుటాహుటిన జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. అల్లుడి వేధింపుల కారణంగా తన బిడ్డ చనిపోయిందని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Show comments