Tirupathi Rao
Tirupathi Rao
కొన్ని సంఘటనలు హృదయాలను మెలిపెడితాయి. కళ్లను చమ్మగిల్లేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా అలాంటిదే. నాన్న నన్ను కూడా తీసుకెళ్లు అంటూ మారం చేస్తూ చేయి పట్టుకుని వెంటపడిన చిన్నారి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. సరిగ్గా నాన్న అని కూడా పిలవడంరాని ఆ బుడతడికి నూరేళ్లు నిండిపోయాయి. ఒకరి నిర్లక్ష్యం ఆ చిన్నారి ఉసురు తీసింది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. కారు రూపంలో మృత్యువు ఆ చిన్నారిని కబళించింది.
ఈ ఘటన అనంతపురంలో జరిగింది. పెద్దవడుగూరు మండలం ఎం.రాంపురం గ్రామానికి చెందిన దస్తగిరి, నజ్మూన్ దంపతులు అనతంపురం శివారులోని చంద్రబాబు కొట్టాలలో నివాసముంటున్నారు. దస్తగిరి ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసే వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీళ్లు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. ఈ జంటకు ఒక కుమార్తె, కుమారుడు ఆసీఫ్(15 నెలలు) ఉన్నారు. ఎప్పటిలాగానే బుధవారం కూడా దస్తగిరి విధులకు బయల్దేరాడు. అయితే 15 నెలల ఆసీఫ్ తండ్రి వెంటపడ్డాడు. తనని కూడా తీసుకెళ్లాలి అంటూ మారాం చేశాడు. దస్తగిరి ఎంతో ప్రయత్నించి నచ్చజెప్పి.. ఆసీఫ్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అయితే తండ్రి తనని తీసుకెళ్లలేదని ఆసీఫ్ దిగులుగా రోడ్డుమీదే నిల్చుని ఉన్నాడు. అప్పుడే ఫ్రూట్స్ మండీ మేస్త్రీ రఘు కారును తీసుకెళ్లేందుకు తన మిత్రుడు వచ్చాడు.
కారు తీసుకెళ్లే సమయంలో రివర్స్ గేర్ వేసి వెనక్కు వచ్చాడు. ఇరుకు సంధు కావడం, రోడ్డు మీద ఉన్న ఆసీఫ్ ను అతను గమనించకపోవడంతో కారుతో ఢీకొట్టాడు. చిన్నారి తల మీదుగా కారు దూసుకెళ్లింది. అతను వెంటనే కారుని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, బాధిత కుటుంబం అందుకు అంగీకరించలేదు. చిన్నారి మృతదేహాన్ని తీసుకుని ప్రమాదానికి కారకుల ఇంటి ముందు నిరసనకు దిగారు. గొయ్యి తీసి వాళ్ల ఇంటిముందే చిన్నారి మృతదేహాన్ని పాతిపెడతామంటూ ఆందోళన చేశారు. పోలీసులు కలగజేసుకుని బాధిత కుటుంబానికి నచ్చజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.