iDreamPost
android-app
ios-app

దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయారు.. సోషల్ మీడియా పట్టించింది

దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయారు.. సోషల్ మీడియా పట్టించింది

దొంగలు చోరీ చేసిన వస్తువులను గప్ చుప్‌గా నగదు రూపంలో మార్పిడి చేసుకుని వచ్చిన డబ్బులను జల్సాగా ఖర్చు చేసుకుంటారు. ఇక డబ్బులు కొట్టేస్తే.. రిస్క్ ఎక్కువ ఉండదు కాబట్టి.. పండుగ చేసుకుంటారు. పోలీసులకు కూడా ఓ పట్టా దొరకని దొంగలు.. సోషల్ మీడియా కారణంగా దొరికిపోయారంటే నమ్ముతారా? నిజంగా ఇది నిజం. సోషల్ మీడియానే దొంగలు పట్టుకోవడానికి కారణమైంది. ఎవరైనా దొంగతనం చేసి డప్పుకొట్టుకుంటారా. ఇదిగో సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిన ఈ దొంగలు.. తాము చేసిన చోరీ చేసిన డబ్బుల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. కటకటాల పాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం నేటి యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ప్రతి దాన్ని వీడియో తీసి రీల్స్ అంటూ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారు. అయితే తామేమీ తీసుపోలేదనుకున్నారేమో ఏమో దొంగలు, కిరాతకులు సైతం రీళ్లు చేస్తున్నారు. ఇదే ఓ దొంగతనం కేసులో దొంగలను పట్టించింది. కొద్ది రోజుల క్రితం కాన్పూర్ లోని ఓ జ్యోతిష్కుడి ఇంటి నుండి లక్షలను కాజేశారు దొంగలు. ఇల్లు గుల్లయ్యే సరికి లబోదిబో మంటూ బాధితుడు తరుణ్ శర్మ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌లో డబ్బులను బ్యాగుల్లో నింపుకోవడం కనిపించింది. అయితే దొంగల ముఖాలు కనిపించకపోవడంతో వారి కోసం వెతకసాగారు. వారి గురించి ఎటువంటి క్లూ కూడా దొరకలేదు.

అటువంటి సమయంలో ఇన్ స్టా గ్రామ్‌లో వచ్చిన రీల్ ఆ దొంగల్ని పట్టించింది. దొంగతనం చేసిన డబ్బులతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యింది. దొంగిలించిన డబ్బులను మంచంపై పరిచి వీడియో తీశారు. ఆ వీడియోను రీల్స్ రూపంలో పొందుపరిచారు. ఓ వ్యక్తి తన చేతిలో రూ. 500 నోట్లు పట్టుకున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో పాటు.. దొంగతనానికి గురైన నోట్ల కట్టలని గుర్తించి.. ఒకరిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రూ. 2 లక్షల రూపాయలు, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.