రైలులో కాల్పుల కేసు.. సంచలన నిజాలు వెల్లడించిన RPF కానిస్టేబుల్!

జైపూర్ ఎక్స్ ప్రెస్ లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏఎస్సై, ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక హైదరాబాద్ వాసి కూడా ఉన్నాడు. ఈ ఘటన యావత్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఒక రైల్వే పోలీసు ఇలా కదులుతున్న రైలులో కాల్పులు జరపడంతో అంతా షాక్ కు గురయ్యారు. చేతన్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో చేతన్ సింగ్ సంచలన విషయాలను బయటపెట్టాడు.

విచారణలో చేతన్ సింగ్ పలు విషయాలను వెల్లడించాడు. అతను ముఖ్యంగా తన పైఅధికారిపై ఆరోపణలు చేసినట్లు చెబుతున్నారు. చేతన్ మొదట తన పైఅధికారి ఏఎస్ఐ టికా రామ్ మీనా పైనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత బీ5 బోగీలోకి వెళ్లి అక్కడ ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. చేతన్ సింగ్ తనకు ఆరోగ్యం బాగోలేదని.. తనను రిలీవ్ చేయాలని కోరాడంట. కానీ, ఏఎస్ఐ అందుకు అంగీకరించకుండా ముంబయికి వెళ్లాక సరైన వైద్యం చేయించుకుందువని చెప్పాడట. అనారోగ్యం అనగానే.. అతనికి జ్వరం వచ్చిందేమో అని చెక్ చేశారు. కానీ, అతనికి జ్వరం కాదని తెలిసి ఇబ్బంది గురించి అడిగారు. అప్పుడు ఏఎస్ఐ చేతన్ సింగ్ ని పై అధికారులతో మాట్లాడించారు.

మొదట వాళ్లంతా చెస్ట్ పెయిన్ అనుకున్నారు. కానీ, చేతన్ సింగ్ తాను హైడ్రోసిల్ తో బాధపడుతున్నట్లు చెప్పాడు. హైడ్రోసిల్ అంటే వృషణాల్లో వాపు రావడం. ఆ కారణంగా తాను ట్రైన్ లో నడవకలేకపోతున్నాను అంటూ టికా రామ్ మీనాకు విన్నవించుకున్నాడట. హైడ్రోసిల్ అని చెప్పిన తర్వాత పైఅధికారులు తనని ట్రైన్ మధ్యలో దిగద్దని చెప్పారు. అలాచేస్తే పరిస్థితి మరీ దిగజారిపోతుందని చెప్పారట. అతడిని బీ4 కోచ్ లో విశ్రాంతి తీసుకోమని తెలియజేశారు. అతని రైఫిల్ కూడా తీసుకున్నారు. తాను వల్సాడ్ లో దిగిపోతానని కోరాడట. నిజానికి ఆ ట్రైన్ కు వలసాడ్ లో స్టాప్ లేదు. కానీ, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఏ స్టేషన్ లోనైనా ట్రైన్ ను ఆపచ్చు.

ఒక 15 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకున్న చేతన్ సింగ్ సహోద్యోగి రైఫిల్ తీసుకుని ఈ కాల్పులు జరిపినట్లు చెప్పారు. తర్వాత బీ5 కోచ్ లోకి వెళ్లి.. మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. అయితే ఏఎస్ఐపై కోపంతో కాల్పులు జరిపితే.. ప్రయాణికులపై ఎందుకు కాల్పులు జరిపాడు అనేది తెలియాల్సిన విషయం. మరోవైపు చేతన్ సింగ్ ప్రవర్తనపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దృష్టి సారించింది. సోషల్ మీడియాలో చేతన్ సింగ్ గన్ పట్టుకుని ప్రయాణికులతో పాకిస్తాన్, స్థానిక రాజకీయం గురించి చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపే అవకాశం లేకపోలేదు.

Show comments