Dharani
Dharani
ప్రేమకున్న శక్తి ముందు ఏ అణ్వాయుధం సరిపోదు.. ఓ మనిషిని విజేతగా నిలపాలన్నా.. ఓడించి అందరి ముందు అవమానించాలన్న ఒక్క ప్రేమకే సాధ్యం. నిజమైన ప్రేమ.. కేవలం ఎదుటి వారి సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. ప్రేమించిన వ్యక్తి మనతో పాటు మన జీవితంలో ఉన్నా లేకున్నా సరే.. వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని ఆశిస్తుంది. మరి నేటి కాలం ప్రేమలో ఇలాంటివేమి కనిపించడం లేదు. ఓ వ్యక్తిని ప్రేమించామంటే.. వారి మీద మనకే పూర్తి హక్కులు వచ్చేసినట్లు భావిస్తున్నారు. బతికితే తమతో కలిసి బతకాలి లేదంటే చావాలి అనే వికృత ధోరణి పెరుగుతోంది. దాంతో ప్రేమ పేరుతో రాక్షసులుగా మారి.. ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు కొందరు.
ఇక మరి కొందరేమో.. ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందని.. ప్రాణాలు తీసుకుంటూ.. కన్నవారికి తీరని కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికంటే ముందు సెల్ఫీ వీడియో తీసి తన తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ తన చివరి సందేశాన్ని పంపాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో చోటు చేసుకుంది. ప్రియురాలి మోసాన్ని తట్టుకోలేక అగ్రికల్చర్ స్టూడెంట్ ఒకరు రన్నింగ్ ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కుర్వ మహేష్ (21) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో అగ్రికల్చర్ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో మహేష్‌కు అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. కొంత కాలం నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమికుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు యువతి మహేష్‌ని దూరం పెట్టింది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన మహేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం శంకర్‌పల్లి పట్టణానికి వచ్చాడు. రైల్వేస్టేషన్‌కు వెళ్లి.. జనాలు లేని చోట.. పట్టాలపై నిల్చొని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. దాని కంటే ముందు.. తల్లిదండ్రులకు ఒక సెల్పీ వీడియో పంపించాడు మహేష్.
దీనిలో ప్రియురాలి మోసం తట్టుకోలేకనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘‘అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి. నాకు అస్సలు బ్రతకాలని నలేదు. ఆ అమ్మాయి నన్ను విడిచిపెట్టిపోయింది. నన్ను ఘోరంగా మోసం చేసింది. నేను ఉండలేను ఇగ. నేను పోతా. అమ్మ,నాన్నలను మంచిగ చూసుకో అన్న. ఈ బాధ భరించడం నా నుంచి అయితలేదు’’ అని వీడియో సందేశాన్ని కుటుంబసభ్యులకు సెండ్ చేశాడు. ఆ తర్వాత రైలు పట్టాలపై పడుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. కొన్ని నెలలు ప్రేమించిన పిల్ల కోసం.. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇంత మోసం చేస్తావా.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.