ప్రముఖ జర్నలిస్ట్‌ దారుణ హత్య!

ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దారుణాలు బాగా పెరిగాయి. జర్నలిస్టులపై దాడులు చేయటం, చంపటం వంటి సంఘటనలు నిత్యం ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, బిహార్‌లో ఓ ఘోరం చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ ప్రముఖ జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌లోని అరారియా జిల్లాకు చెందిన విమల్‌ కుమార్‌ అనే వ్యక్తి ఓ ప్రముఖ హిందీ డైలీలో పనిచేస్తున్నాడు. అతడికి జర్నలిస్టుగా రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. అలాంటి అతడిపై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు.

రాణిగంజ్‌ బజార్‌ ఏరియాలో విచక్షణా రహితంగా ఆయన్ని కాల్చి చంపారు. విమల్‌ ఈ కాల్పుల్లో అక్కడికక్కడే మరణించాడు. అక్కడి వారు ఈ కాల్పుల విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విమల్‌ హత్య విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. అనంతరం విమల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. నిందితుల్ని పట్టుకునే పనిలో బిజీ అయిపోయారు.

ఇక, విమల్‌ హత్యపై అరారియా జిల్లా జర్నలిస్ట్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ అమరేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ ఉదయం పూట జర్నలిస్ట్‌ను ఇలా కాల్చి చంపటం షాక్‌కు గురి చేస్తోంది. రాష్ట్రంలోని పోలీస్‌ వ్యవస్థకు ఇది అద్దం పడుతోంది. రెండేళ్ల క్రితం విమల్‌ సోదరుడు చనిపోయాడు. ఇప్పుడు విమల్‌ను దారుణంగా హత్య చేశారు. కొన్ని నెలలకు ముందు నుంచి విమల్‌కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అది ఎంత వరకు నిజమో పోలీసుల విచారణలో తేలుతుంది. కానీ, ఈ సంఘటన మాత్రం హృదయ విదారకమైనది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, జర్నలిస్ట్‌లపై పెరుగుతున్న దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments